
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఫలితాలను ప్రభావితం చేయడంలో రాహుల్– ప్రియాంక ద్వయం కీలకంగా మారనున్నారని సాంకేతిక నిపుణుడు, కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా అన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్–ప్రియాంక ద్వయంతోపాటు సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సిందియా, మిలింద్ దేవ్‌రా వంటి యువనేతలతో మంచి బృందం ఏర్పడిందని ఆయన కితాబునిచ్చారు. భవిష్యత్తుపై కొత్త దార్శనికత, ఉద్యోగ కల్పనపై శ్రద్ధ, అందరికీ అవకాశాలు కల్పించగలిగిన నేత దేశానికి అవసరమన్నారు. 2014 ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఎన్నో విషయాలను ఆకళింపు చేసుకుని ‘పరిణతి పొందిన, తెలివైన, దృఢమైన నేతగా దేశ ప్రధాని పదవికి అర్హత సాధించారు. ఆయనకు వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాలు లేవు. దేశం కోసం, ప్రజల కోసం పనిచేయడంపైనే ఆయన శ్రద్ధంతా’అని వివరించారు.
ప్రియాంక ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించడంపై ఆయన స్పందిస్తూ.. ఆమె మంచి రాజకీయనేత, పార్టీకి ఆమె గొప్ప ఆస్తి’అని అభివర్ణించారు. తన అన్న రాహుల్‌తోపాటు ఆమె కూడా యువతను ముఖ్యంగా మహిళలను ఆకట్టుకోవడంలో ముందుంటారు’అని చెప్పారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక రాహుల్ ప్రజాదరణ బాగా పెరిగింది. ఆయన స్వేచ్ఛగా తన నిర్ణయాలను అమలు చేసే వీలు చిక్కింది. పార్టీలోకి యువ నాయకుల బృందాన్ని తయారు చేసుకుంటున్నారు. పాత తరం నాయకులను గౌరవిస్తున్నారు’అని తెలిపారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా కూడా భారత్‌లో మాదిరిగా ఈవీఎంల సాంకేతికతను వాడటం లేదు. ఈవీఎంల పనితీరుపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దానిని విస్మరించడం సరికాదు’అని పేర్కొన్నారు. ఏఐసీసీ ఓవర్‌సీస్ విభాగం అధ్యక్షుడు, గాంధీ కుటుంబానికి చిరకాల మిత్రుడు అయిన శామ్ పిట్రోడా.. రాజీవ్ గాంధీ హయాంలో సీ–డాట్ ఏర్పాటుకు, యూపీఏ హయాంలో నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్, నాలెడ్జి కమిషన్‌ల ఏర్పాటుకు కృషి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment