పచ్చదండు..గోదారి దోపిడి | Sand Mining In East Godavari | Sakshi
Sakshi News home page

పచ్చదండు..గోదారి దోపిడి

Published Thu, Apr 4 2019 12:36 PM | Last Updated on Thu, Apr 4 2019 12:36 PM

Sand Mining In East Godavari - Sakshi

కాకినాడ నడిబొడ్డున ఒక రోడ్డుపై అమ్మకానికి గుట్టగా పోసిన ఇసుక , కోటనందూరు మండలం బొద్దవరం వద్ద తాండవ గట్టున ఇసుక తవ్వకం,

సాక్షి, కాకినాడ : ఇసుక అక్రమార్కుల దాహానికి గోదావరి, తాండవ నదుల గర్భాలు గుల్ల అయిపోయాయి. ఉచితం ముసుగులో టీడీపీ నేతలు చెలరేగిపోయారు. నదులు, వాగుల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరిపి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఇసుక స్వాహా జరిగింది. వరదలతో వేసిన మేటలను తొలగించేందుకని జిరాయితీ భూముల పేరుతో అనుమతులు తీసుకుని ఇసుకను దోచేశారు. మాన్సాస్‌ ట్రస్టు భూముల అనుమతుల ముసుగులో ఎక్కడికక్కడ ఇసుకను తోడేశారు. ఈ క్రమంలో కాలువలను, సమాధులను సైతం తవ్వేశారు. ఉచిత ఇసుక విధానం అక్రమార్కులకు కల్పతరువుగా తయారైంది. రేవుల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. 

అడ్డూఅదుపూ లేకుండా అనధికార ర్యాంపులు
అధికార పార్టీ నేతల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. జిల్లాలో 38 రేవులతో పాటు అనధికార  ర్యాంపులు ఏర్పాటు చేసుకుని స్వాహాకు పాల్పడ్డారు. ఎక్కడ ఇసుక కనబడితే అక్కడే తవ్వేశారు. రూ.3 వేల కోట్లకు పైగా దోపిడీ చేశారు. అధికారం అండతో అనుమతులు తెప్పించుకుని యథేచ్ఛగా దోపిడీ చేశారు. ర్యాంపుల నిర్వహణ ముసుగులో అధికార పార్టీ నేతలు రూ.కోట్లకు పడగలెత్తారు. గోదావరి పాయలు న్న ప్రతిచోటా దర్జాగా తవ్వేశారు. ఇష్టారీతిన బాటలు వేసి అమ్ముకున్నారు.

మాన్సాస్‌ భూములని కొన్నిచోట్ల, జిరాయితీ భూములని మరి కొన్ని చోట్ల చూపించి, అనుమతులు తెప్పించుకుని రాత్రి  పగలనే తేడా లేకుండా పొక్లైన్లతో తవ్వించి, లారీలు, కంటైనర్ల ద్వారా తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ స్టాక్‌ పాయింట్‌లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వ్యాపారం సాగిస్తున్నారు. ఇసుక లారీలు, ఇతర వాహనాలు వెళ్లే గ్రామాల్లో రోడ్లు ఛిద్రమైపోతున్నాయి. ఆ వాహనాల జోరు ప్రమాదాలకు కారణమై ప్రాణాలను బలిగొన్న ఘటనలూ ఉన్నాయి. ఇళ్లు కట్టుకుందామనుకునే సామాన్యులకు ఇసుక అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. సామాన్యులు కొనలేని విధంగా అనధికారికంగా ఇసుక ధరలను పెంచేశారు.
 
ఇసుక దోపిడీలో కీలక పాత్రధారి పెందుర్తి
సీతానగరం మండలంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో సాం్థనిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ ప్రధానపాత్ర పోషించారన్నది అందరికీ తెలిసిందే.  2014 ఎన్నికల అనంతరం మొదట సింగవరం ర్యాంపు నుంచి అత్యధికంగా ఇసుకను లారీలపై తరలించేవారు. అందులో రూ.110 కోట్లు పైగా సంపాదించారనే ఆరోపణలున్నాయి. కాటవరం పంపింగ్‌ స్కీమ్‌ వద్ద గోదావరి వరదతో ఇసుక మేటలు వేయడంతో స్కీమ్‌ పనిచేసేలా తవ్వకాలు అని చెప్పి అనుమతులు తీసుకుని, దానిని ఎమ్మెల్యే తన బినామీలకు అప్పగిండం ద్వారా సుమారు రూ.80 కోట్లు వరకు జేబులో వేసుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాటవరం ర్యాంపు నుంచి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే మునికూడలి, రఘుదేవపురం ర్యాంపుల నుంచి ఇప్పటికీ ఇసుకను తరలిస్తునే ఉన్నారు. వీటి ద్వారా ఎమ్మెల్యేకి కోట్లాది రూపాయలు ముడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.   

హోం మంత్రి అనుచరుడి దందా
అయినవిల్లి మండలం ముక్తేశ్వరం రేవు, గంగవరం మండలం కోటిపల్లి గ్రామాల మధ్య ఉన్న గౌతమీ నదీ పరీవాహకాన్ని ఆనుకుని ఉన్న మాన్సాస్‌ ట్రస్టు భూముల్లో కూడా ఇసుక మేటలను తొలగిస్తామని అనుమతులు తీసుకుని  హోంమంత్రి అనుచరుడు ఏకంగా రోజుకి రూ. 50 లక్షల ఇసుకను దోచుకున్నాడు. వశిష్ట గోదావరిని గుల్ల చేసేసి ఇసుకను తోడేశారు. వ్యవసాయ భూముల మేటల తొలగింపునకని, ప్రైవేటు కంపెనీల నిర్మాణాలకని నదీ గర్భాన్ని కబ్జా చేసేశారు. రోజుకి రూ.15 లక్షల నుంచి రూ. 20లక్షల వరకు దోచేసి, నెలనెలా కోట్లు గడించారు. 

దాట్ల సోదరుడి కనుసన్నల్లో ..
ముమ్మిడివరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే బుచ్చిబాబు  సోదరుడు పృథ్వీ ఆశీస్సులతో గౌతమి, వృద్ధ గౌతమీ నదిపాయలను గుల్ల చేసేస్తున్నారు. రోజుకు వేలాది ట్రాక్టర్ల ఇసుకను తరలించేశారు. నాలుగున్నరేళ్లుగా రూ.50 కోట్లకు పైగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. అలాగే పిల్లంక, పల్లవారిపాలెం, అన్నంపల్లి, ఎదుర్లుంక, కేశనకుర్రు పశువుల్లంక ఇసుక ర్యాంపుల్లో అన«ధికార రవాణా కొనసాగింది. నియోజక వర్గానికి ఆనుకుని ఉన్న పాండిచ్చేరి పరిధిలోని యానాం అక్రమార్కులకు అడ్డాగా నిలిచింది. యానాంలో అధికారులకు ఇసుక రవాణాపై ఎటువంటి ఆంక్షలు  లేకపోవడంతో  ఇసుక మాఫియా రాజ్యమేలింది.ముమ్మిడివరం, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల్లో పది అనధికార రీచ్‌లద్వారా కోట్లాది రూపాయల ఇసుకను అక్రమంగా తరలించుకు పోయారు.

బోడసకుర్రు రేవులో తెలుగుతమ్ముళ్ల అక్రమ తవ్వకాలు
మూడేళ్ల క్రితం మూసివేసిన ఇసుక ర్యాంపును అధికారికంగా ఒకసారి, అనధికారికంగా రెండవసారి తెరిపించి టీడీపీ నేతలు అడ్డగోలుగా దోపిడీ చేశారు. అధికారిక అనుమతి లేకున్నా అధికారపార్టీ మద్దతుదారుడు, ఎమ్మెల్యే ఆనందరావుకు  అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఆధ్వర్యంలో ఇసుక దందా జరిగింది. వాకలగరువు, దొడ్డవరం గ్రామాల మధ్య ఉన్న ఇసుక మేటలను పడవల ద్వారా తరలించి అమ్ముకున్నారు. బోడసకుర్రు బ్రిడ్జి సమీపంలో ఇసుక తవ్వకాలు జరపరాదన్న నిబంధనను సైతం ఉల్లంఘించారు. పొక్లెయిన్‌ల సహాయంతో ఇసుక తవ్వకాలు చేయడం వల్ల బ్రిడ్జికి పెను ముప్పు ఏర్పడింది. ఓడలరేవు తీరాన్ని ఇష్టానుసారం తవ్వేశారు.  కొమరిగిరపట్నానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆరు ఎకరాల భూమిని సాగుకు యోగ్యంగా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరడం, అందుకు మైనింగ్‌ కార్పోరేషన్‌ అనుమతి ఇవ్వడంతో అవినీతి దందాకు తెరదీశారు. దీనిని అడ్డుగా పెట్టుకుని అందుకు వందరెట్లు ఇసుక తవ్వకాలు చేశారు. 

యూనిట్‌ ఇసుకకు బాట చార్జీలు రూ. 100
లోడింగ్‌  చేసే కూలీల చార్జీలు రూ. 200
ఉచిత ఇసుక విధాన నిబంధనలివి. 

ఈ మొత్తాన్ని చెల్లించి ఇసుక తీసుకెళ్లొచ్చు
ఉచితం కాక ముందు ట్రాక్టర్‌ ఇసుక ధర-  రూ. 1000 నుంచి రూ.1200
ఉచితం అని ప్రకటించాక  -  రూ.2000 నుంచి రూ.2500
ఉచితానికి ముందు లారీ  ఇసుక ధర  -  రూ. 3 వేలు
ఉచితం అన్నాక -   రూ.5 వేల నుంచి రూ.6 వేలు
ఇదీ చంద్రబాబు ‘ఉచిత ఇసుక’ విధానంతో దాపురించిన వైపరీత్యం  

నడిగాడిలో లోకేష్‌ ర్యాంపు!
ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులో వశిష్టా గోదావరి నదిలో రేయింబవళ్లు యథేచ్ఛగా డ్రెడ్జర్లతో ఇసుకను తోడేశారు. మంత్రి లోకేష్‌ ర్యాంపుగా చెప్పుకొనే  ఎల్‌.గన్నవరం శివారు నడిగాడి నుంచి పశ్చిమ జిల్లా ఆచంట మండలం పుచ్చల్లంక వరకూ సుమారు కిలో మీటరు పొడవునా 20 నుంచి 25 అడుగుల లోతున అక్రమ తవ్వకాలు సాగించారు. ఒడ్డుకు బోట్లు ద్వారా ఇసుకను తెచ్చి అక్కడి నుంచి ట్రాక్టర్లు, లారీల ద్వారా స్టాక్‌ పాయింట్‌ల వద్దకు  తరలించి అమ్ముకున్నారు.  ఇక్కడ ఇసుక సొమ్ము అంతా మంత్రి లోకేష్‌ జేబులోకి వెళ్లిందని టీడీపీ వర్గాలే చెపుతున్నాయి. అయినవిల్లి, కె.గంగవరం మండల పరిధిలోని కోటిపల్లి బాగ, పురుగులంకలో మాన్సాస్‌ ట్రస్టు భూముల్లో ఇసుక, మట్టి దోచుకున్నారు. ఇక్కడ తవ్వకాల వలన పంట భూములు  కోతకు గురై నదీగర్భంలో కలిసిపోయాయి. కోతకు నిరోధానికి నిర్మించిన గ్రోయిన్లు కూడా పాడైపోతున్నాయి.  


కాకినాడలో లారీ ఇసుక రూ.15 వేలు
బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరంలో ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక ఉచితమని ఆర్భాటంగా ప్రకటించినా టీడీపీ నాయకులుఇతర ప్రాంతాల నుంచి  తెచ్చి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. రాత్రివేళల్లో వివిధ ప్రాంతాల్లోని ర్యాంపుల నుంచి ఇసుక లారీలపై ఇక్కడ అన్‌లోడింగ్‌ చేస్తున్నారు. పగలు ఇసుక కావల్సిన వారికి అధిక రేట్లుకు విక్రయిస్తున్నారు. ముందుకు చెప్పిన వారికి ఒక రేటు, అర్జంటుగా ఇసుక కావాలంటే ఒక రేటు వసూలు చేస్తున్నారు. ఒక లారీ ఇసుక కావాలంటే రూ. 15 వేలు వసూలు చేస్తున్నారు. గతంలో ఈ ఇసుక రూ. 5 నుంచి 6 వేలు లోపు ఉండేది.  

ఇసుకలోనూ కల్తీ
పిఠాపురం: టీడీపీ నేతలు నియోజకవర్గంలో ఏలేరు, ఇతర పంట కాలువల్లో దొరికే ఇసుకను యథేచ్ఛగా అక్రమ రవాణా చేసి రూ.కోట్లు స్వాహా చేశారు. ఉచిత ఇసుక పేరిట లారీల కొద్దీ ఇసుకను అక్రమంగా రవాణా చేశారు. దొరికిన చోటల్లా వందల యూనిట్ల ఇసుకను తవ్వి భారీ మొత్తంలో నిల్వ చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల వద్ద వందలాది యూనిట్ల ఇసుకను నిల్వ చేశారు. లారీ ఓనర్లు, వ్యాపారులు కుమ్మక్కై ఇసుక కృతిమ కొరత సృష్టించి రెట్టింపు రేటుకు విక్రయించారు. మూడు యూనిట్ల లారీ ఇసుకను రూ.11 వేల నుంచి రూ.12 వేలకు విక్రయించారు. గోదావరి ఇసుకతో పాటు గొర్రిఖండి, ఏలేరు ఇతర పంట కాలువల్లో దొరికే ఇసుకను తీర ప్రాంతంలో లభించే బొండు మట్టిని కలిపి గోదావరి ఇసుకగా అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుకను కూడా కల్తీ చేసిన వారిపై అధికారులు కనీస చర్యలు తీసుకోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.  

కోతకు గురైన పంటభూములు 
తుని: పంట పొలాలకు నీరు అందించే తాండవ నదిని ఇసుక కోసం తెలుగు తమ్ముళ్లు కబళించారు.  ఉచిత ఇసుక జీవో అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. ఐదేళ్ల క్రితం ట్రాక్టర్‌ ఇసుక రూ.800 ఉంటే ప్రస్తుతం రూ.2500కు చేరింది. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడి అండదండలు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడి ఆశీస్సులు ఇసుక మాఫియాకు దండిగా ఉన్నాయి. కోటనందూరు నుంచి తుని వరకు ఎక్కడ పడితే అక్కడ అనధికారిక ర్యాంపులను తెరిచారు. రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీలతో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇసుక తవ్వకాలతో పంటభూములు కోతకు గురయ్యాయి. ఒక అంచనా ప్రకారం ఇసుక రూపంలో ఐదేళ్లలో రూ.20 కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఇదే సొమ్మును  ఎన్నికల్లో ఓట్లు కొనడానికి ఉపయోగిస్తున్నారు. అయితే తాండవ నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న రైతులు తమకు జరిగిన నష్టానికి ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెబుతామని బహిరంగంగానే అంటున్నారు. 

తాండవలో యనమల సోదరుడి దందా 
మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడి ఆశీస్సులతో తాండవ నదిని గుల్ల చేసేశారు. ఐదేళ్లలో రూ.వంద కోట్లకు పైగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. విశాఖ జిల్లా నాతవరం మండలం నుంచి పెంటకోట వరకు తాండవ నది 45 కిలోమీటర్ల మేర తవ్వకాలు జరిపారు. కోటనందూరు, బొద్దవరం, తుని మండలం కొలిమేరు, డి.పోలవరం  ప్రాంతాల్లో అనధికారికంగా ర్యాంపులు నిర్వహించారు.  నదీ పరీవాహక ప్రాంతంలోని పంట భూముల్లో  ఇసుక తవ్వకాలు జరపకూడదని కోర్టు ఉత్తర్వులున్నా పట్టించుకోలేదు. పూర్తిగా తవ్వేసి, ఇసుకను తీసేస్తుండటంతో భూగర్బ జలాలు తరిగి పక్కనున్న పంట భూముల బోర్లు సైతం పనిచేయడం లేదు. తుని మండలం డి.పోలవరంలో తాండవ నదిలో జరుగుతున్న తవ్వకాల వలన రైతులు భూములు కోల్పోతున్నారని తెలుసుకుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వెళితే పోలీసులతో కేసులు కూడా పెట్టించారు.

గోరంట్ల, ఆదిరెడ్డి  పోటాపోటీ ర్యాంపులు
రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గపరిధిలో ధవళేశ్వరంలో గాయత్రి ఇసుక ర్యాంపు 1, 2, కేతావారిలంక ఇసుక ర్యాంపులలో లారీకి రూ.200 కప్పం కట్టాల్సిందే. ఈ లెక్కన రోజుకు రూ.లక్షన్నర చొప్పున ఎమ్మెల్యేకు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రధాన అనుచరుడు, నగరపాలకసంస్థలో ముఖ్యనేత వసూలు చేసేవాడు. అంతేకాక కుమారి« థియేటర్‌ ర్యాంపు గురించి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల, నగర ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ సరిహద్దు తమదంటే తమదని వాదులాడుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాతేరుర్యాంపు ఎస్సీ సొసైటీ తరఫున ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా పేరుకు వారిదే అయినా గోరంట్ల అనుచరుడైన కార్పొరేటర్‌  ర్యాంపును నిర్వహించారు. కడియం మండలంలోని కడియపులంక–వేమగిరి ర్యాంపులో ఉచిత ఇసుక అమలు కావడానికి ముందు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేది. అప్పుడు దాదాపు రూ.2.61 కోట్ల ఇసుక పక్కదారి పట్టినట్లుగా విజిలెన్స్‌ దాడుల్లో తేలింది.  రూరల్‌  ఎమ్మెల్యే గోరంటకు పోటీగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కూడా ఇసుక దందా మొదలు పెట్టారు. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజక వర్గం ధవళేశ్వరం వద్ద తన అనుచరులతో ప్రత్యేకంగా ఇసుక ర్యాంపునే సిద్ధం చేసుకున్నారు. నిత్యం కోట్లాది రూపాయల ఇసుక దోపిడీకి 
పాల్పడ్డారు.   

రోజుకు 300 ట్రక్కుల తవ్వకం 
రాజోలు: రాజోలు నియోజకవర్గంలో టీడీపీ వారు ‘దొరికినంత తవ్వుకో..అయినకాడికి దోచుకో’ అన్న రీతిలో అక్రమ సంపాదనకు తెరతీశారు. గోదావరి ఇసుక రీచ్‌లను స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు పార్టీ కార్యకర్తలకు అప్పగించారు. రాజోలు మండలం సోంపల్లి, మలికిపురం మండలం రామరాజులంక, సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి.  పేరుకు ఉచితం అయినా రవాణా చార్జీల పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక్కో రీచ్‌ నుంచి రోజుకు దాదాపు 100 ట్రక్కుల ఇసుక తరలిపోతోంది. ప్రభుత్వం చేపట్టిన పనులకు,  హౌసింగ్‌ స్కీంలకు మాత్రమే ఇసుక తరలించాల్సి ఉండగా ఆ ముసుగులో ప్రైవేటు పనులకు కేటాయిస్తున్నారు. 

వారధికి చేరువలోనే.
అల్లవరం (అమలాపురం):  అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు యథేచ్ఛగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. మూడేళ్ల క్రితం మూసివేసిన ఇసుక ర్యాంపును ఎలాంటి అనుమతులు లేకుండానే తెరిచి వందలాది క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలించి సొమ్ము  చేసుకున్నారు. అల్లవరం మండలం బోడసకుర్రు బ్రిడ్జిని ఆనుకుని అధికార పార్టీ నాయకుడి కనుసన్నల్లో ఇసుక ర్యాంపు నిర్వహించారు.   బ్రిడ్జి సమీపంలో ఇసుక తవ్వకాలు జరపరాదన్న నిబంధనను ఉల్లంఘించారు. పొక్లెయిన్‌లతో ఇసుక తవ్వడం వల్ల బ్రిడ్జికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిసినా తెలుగు తమ్ముళ్లు ఖాతరు చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో అక్రమ తవ్వకాలు జోరుగా సాగాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement