సాక్షి, పశ్చిమ గోదావరి: టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము వ్యతిరేకిస్తున్న నేతలకు టికెటు కేటాయిస్తే ఓడించి తీరుతామని టీడీపీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, చింతలపూడి, నిడదవోలు, గోపాలపురం నియోజవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక టీడీపీకి సవాలుగా మారింది. అసంతృప్త నేతల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో అభ్యర్థుల ఎంపిక టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సమన్వయ కమిటీ ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మూడు, నాలుగు సార్లు సమీక్షలు నిర్వహించినా ఏకాభిప్రాయం రాలేదు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రాకపోవడంతో టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి.
పెండింగ్‌లో కొవ్వూరు సీటు..
కొవ్వూరులో మంత్రి జవహర్‌కు టికెట్ కేటాయించద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అంతటితో ఆగకుండా జవహర్ అవినీతి తారాస్థాయికి చేరుకుందని టీడీపీ శ్రేణులు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. జవహర్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఈ టికెట్‌ను చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారు.
అయోమయంలో పీతల సుజాత..
చింతలపూడిలో మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పీతల సుజాతకు టీడీపీ మెండిచేయి చూపినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆమె కనీసం కొవ్వూరు టికెట్టైనా కేటాయించాలని పార్టీని కోరింది. అయినప్పటికీ చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో సుజాత అయోమయంలో పడ్డారు. అయితే చింతలపూడి రేసులో కారెం శివాజీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు కర్రా రాజారావు, మాజీ జెడ్పీ చైర్మన్ జయరాజులు ప్రయత్నాలు కూడా చింతలపూడి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయిన చంద్రబాబు నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు.
నిడదవోలు సీటుపై చంద్రబాబు నాన్చుడు ధోరణి..
నిడదవోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిడదవోలులో కుటుంబ పాలన, అవినీతి పెరిగిపోయిందంటూ విమర్శలు చేస్తున్నారు. నిడదవోలు టీడీపీ టికెట్ రేసులో శేషారావుతోపాటు ఆయన సోదరుడు వేణుగోపాలకృష్ణ, కుందుల సత్యనారాయణలు ఉన్నారు. అయితే ఈ సీటు విషయంలో చంద్రబాబు నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు తీరుతో నిడదవోలు టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. మరోవైపు గోపాలపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును టీడీపీ క్యాడర్ వ్యతిరేకిస్తుంది. తాడేపల్లిగూడెం సీటు ఈలి నానికి కేటాయించడంపై జైడ్మీ చైర్మన్ రగిలిపోతున్నారు.
నరసాపురం ఎంపీ అభ్యర్థి కోసం నానాపాట్లు..
నరసాపురం పార్లమెంట్ స్థానానికి తమ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీ నానాపాట్లు పడుతుంది. ఈ స్థానంలో నుంచి బరిలో నిలువాల్సిందిగా రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మీని, కొత్తపల్లి సుబ్బారాయుడులపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. అయితే సీతారామలక్ష్మీ, సుబ్బరాయుడులు మాత్రం నరసాపురం స్థానం నుంచి పోటీ చేయమని అంటున్నారు. సుబ్బరాయుడు మాత్రం తనకు నరసాపురం అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment