జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. టీడీపీ అధినేత ఓటమి భయంతో అభ్యర్థులను తికమక పెట్టిస్తున్నారు. ఇప్పటికే 14 నియోజకవర్గాలకు మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించారు. నామినేషన్ల పర్వం ఊపందుకున్నా అయోమయం తొలగడంలేదు. టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో ఎవరు ఉంటారో ఎవరు మారుతారో ఇప్పటికీ స్పష్టత రాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోపక్క టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు చివరిప్రయత్నాల్లో మునిగితేలుతుండడం గమనార్హం.
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు అభ్యర్థిగా ఉంటారో తెలియని పరిస్థితి. రోజుకొక అభ్యర్థిని తెరపైకి తీసుకువస్తున్నారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. తాజా సంఘటనలే ఇందుకు నిదర్శనం. పూతలపట్టు అసెంబ్లీ అభ్యర్థిగా తెల్లం పూర్ణం పేరును మూడు రోజుల క్రితం చంద్రబాబు ప్రకటిం చిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో అధికార పార్టీ పరిస్థితి అనుకూలంగా లేదని తెలుసుకున్న పూర్ణం తీవ్ర అస్వస్థతకు గురై బుధవారం ఆస్పత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు తెల్లం పూర్ణం పోటీ చేయడానికి సిద్ధంగా లేరని అధిష్టానానికి సమాచారమిచ్చాయి. దీంతో హడావుడిగా మాజీ ఎమ్మెల్యే లలితకుమారిని అమరావతికి పిలిపించుకున్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం గురువారంలలితకుమారిని అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది. విషయం తెలుసుకున్న తెల్లం పూర్ణం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. తానే పోటీలో ఉంటున్నానని బీఫారం కూడా తనకే ఇస్తారని ప్రకటించుకున్నారు.
ఏదైనా జరగొచ్చు : ఎస్సీవీ
శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థిగా బొజ్జల సుధీర్‌రెడ్డి పేరును తొలివిడతే ప్రకటించారు. అయితే మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు తనకే టికెట్ కేటాయిస్తారని ఇప్పటికీ ధీమాగా ఉన్నారు. నామినేషన్లు ఉపసంహరణ లోపు ఏదైనా జరగవచ్చునని ఆయన గురువారం కూడా తన అనుచరుల వద్ద వెల్లడించారు. దీంతో శ్రీకాళహస్తి టీడీపీలోనూ గందరగోళం నెలకొంది. గంగాధరనెల్లూరు నుంచి మొదట మాజీ ఎమ్మెల్యే గాంధీకి టికెట్ ఇస్తున్నామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రచారం కూడా చేసుకోమన్నారని ఆయన అనుచరులు తెలిపారు. అయితే అక్కడ పరిస్థితి అయోమయంగా ఉండడంతో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలో అర్థంకాక చివరికి గుమ్మడి హరికృష్ణ పేరును ప్రకటించి మాజీ ఎమ్మెల్యే గాంధీకి షాక్ ఇచ్చారు.
అభ్యర్థుల మార్పుపై మళ్లీ కసరత్తు
జిల్లాలో పలు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు చంద్రబాబు అందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మదనపల్లె టీడీపీ అభ్యర్థి దొమ్మలపాటి రమేష్‌ను మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగా మదనపల్లెకు చెందిన రాందాస్ చౌదరి, మరికొందరు నాయకులు చంద్రబాబు పిలుపుమేరకు అమరావతికి చేరుకున్నారు. అభ్యర్థి మార్పుపై కసరత్తు చేస్తున్నట్లు టీడీపీ శ్రేణులు వెల్లడించాయి. చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి ఏఎస్ మనోహర్‌ను మార్చాలని స్థానిక టీడీపీ నాయకులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
తిరుపతిలోనూ సస్పెన్స్
తిరుపతి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ విషయంలోనూ అయోమయంలో ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ వేరొకరిని ప్రకటించాలా.. లేదా సుగుణమ్మనే కొనసాగించాలా.. అనే అంశంపై బుధ, గరువారాల్లో చర్చలు సాగినట్లు అమరావతి నుంచి సమాచారం. తంబళ్లపల్లె సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌కు కాకుండా వేరొకరికి ఇవ్వాలని మొన్నటి వరకు సస్పెన్స్‌లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే అక్కడ పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరికి శంకర్‌యాదవ్ పేరునే ప్రకటించాల్సి వచ్చిందని టీడీపీ శ్రేణులు వెల్లడించాయి. ఇలా జిల్లాలో పలు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఇంకా తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలిసింది. నామినేషన్ చివరి రోజు వరకు అభ్యర్థుల పేర్లు ఖరారుపై స్పష్టత వచ్చే అవకాశం లేదని తాజా సమాచారం.
బీఫారం నాకే వస్తుంది
నేను పరారైనట్లు రకరకాల పుకార్లు వచ్చాయి. నాకు బీపీ, షుగర్ లెవల్స్ పడిపోవడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాను. ఈ విషయం ఎమ్మెల్సీకి చెప్పాను. బీఫారం గురువారం తీసుకుంటానని చెప్పాను. లేనిపోని పుకార్లు సృష్టించి అయోమయానికి గురిచేశారు. బీఫాం నాకే వస్తుంది.’’ – పూర్ణం, పూతలపట్టు అసెంబ్లీ స్థానానికి టీడీపీ మొదట ప్రకటించిన అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment