సాక్షి, న్యూఢిల్లీ : విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, ఈ ద్రోహంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామేనని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ ఎంపీల నిరవధిక నిరాహార దీక్షలకు ఆయన సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఇక్కడి ఏపీ భవన్‌లో దీక్షాస్థలికి శనివారం మధ్యాహ్నం వచ్చిన ఆయన ఎంపీలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏచూరి వేదికపై నుంచి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘సీపీఎం నుంచి ఈ దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్నా.
కృతజ్ఞతలు ఆశించి రాలేదు. ఇది మా కర్తవ్యం.. బాధ్యత. మన ఆంధ్రప్రదేశ్‌కు, మన ప్రజానీకానికి న్యాయం జరగాలి. ఎప్పుడైతే విభజన బిల్లు వచ్చిందో ఆనాడు మొదటిసారి నేను పార్లమెంటులో తెలుగులో మాట్లాడాను. పోలవరంపై.. విద్యుత్ సమస్యపై ఎప్పుడైనా చర్చించారా? ప్రభుత్వ ఉద్యోగుల పంపకాలపై మాట్లాడారా? చర్చించారా? ఇవన్నీ తేల్చకుండా ఎలా విభజిస్తారు? దీనివల్ల సమస్య మరింత పెరుగుతుందని చెప్పాను. ఈ నష్టాన్ని ఎలా భరిస్తారని ప్రశ్నించాను. అందులో నుంచి పుట్టిందే ప్రత్యేక హోదా అంశం. వెంకయ్యనాయుడు లేచి తమ ప్రభుత్వం వస్తే పదేళ్లు ఇస్తామన్నారు. కానీ, చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. టీడీపీ వాళ్లు బీజేపీతో వెళ్లి పదేళ్లు తెస్తామని వాగ్దానం చేశారు. కానీ ఏం జరగలేదు. అందుకే ఈ పోరాటాలు. ఇక్కడ ఎంపీలు రాజీనామా చేసి దీక్షకు దిగారు. మా పార్టీ తరపున సంఘీభావం తెలుపుతున్నాను. దేశవ్యాప్తంగా ఏం చేయాలో అదీ చేస్తాం. అది మా బాధ్యత..’ అని ఏచూరి వివరించారు.
బీజేపీ బెంబేలు
కాగా, ఈ పార్లమెంటు సమావేశాలు విఫలమవడానికి కారణం బీజేపీయేనని, వారికి కావాల్సిన బిల్లులు.. ఏ చర్చా లేకుండా బడ్జెట్ పాస్ చేసుకుని అవిశ్వాసాన్ని మాత్రం చర్చకు రానీయలేదన్నారు. అవిశ్వాస తీర్మానం వస్తే వారి మిత్రపక్షాలైన శివసేన, అకాళీదళ్ ఏ వైఖరి తీసుకుంటాయోనని బీజేపీ బెంబేలెత్తిందని ఎద్దేవా చేశారు. కాగా, ఏపీ, తెలంగాణలో పొత్తులపై స్పందించాలని కోరగా.. ఎన్నికల సందర్భంలో ఆలోచిస్తామని ఏచూరీ బదులిచ్చారు.
ద్రోహంలో టీడీపీ భాగస్వామి
Published Sun, Apr 8 2018 2:07 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment