
సాక్షి, ముంబై : ప్రముఖ హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి తీరాల్సిందేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా ఎవరైన గళం విప్పితే వారందరిని అరెస్ట్ చేసి అండమాన్ జైల్లో నిర్బంధించాలని అన్నారు. శనివారం ఆయన ముంబైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వీర్ సావర్కర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని శివసేన తొలినుంచి డిమాండ్ చేస్తోందని ఆయన గుర్తుచేశారు. దీనిపై కాంగ్రెస్ భిన్నవాదనలను వినిపిస్తోందని, తమ నిర్ణయాన్ని ఆ పార్టీ గౌరవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. (వీర్ సావర్కర్‌కు భారతరత్న!)
దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన సేవ, త్యాగం ఎంతో గొప్పదని రౌత్ అభిప్రాయపడ్డారు. కాగా వీర్ సావర్కర్‌కు వ్యతిరేకంగా కొందరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.. ఆయన కృషికి గుర్తింపుగా అత్యున్నత పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రౌత్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు సావర్కర్ మనవడు.. రంజిత్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ శివసేన దారిలో నడవాలని అన్నారు. మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి వస్తే.. వీరసావర్కర్‌కు భారతరత్న కోసం ప్రయత్నిస్తామని భారతీయ జనతాపార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.