సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారంటూ జరుగుతున్న చర్చ ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణంపై చర్చించటంతోపాటుగా అన్ని విపక్షపార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు తమ ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇందుకోసం వచ్చేవారం 18 విపక్ష పార్టీలతో సమావేశం కావాలని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించారు. దీంట్లో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ ఢిల్లీ నివాసంలో సోమవారం సాయంత్రం విపక్ష పార్టీల భేటీ జరిగింది.
రాష్ట్రపతి ప్రసంగం తర్వాత..
పార్లమెంటు సెంట్రల్ హాల్లో సోమవారం నాటి రాష్ట్రపతి ప్రసంగం తర్వాత సోనియా గాంధీతో శరద్ పవార్ ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం సీపీఐ నేత డి. రాజా కూడా వీరితో కలసి మాట్లాడారు. దీంట్లో విపక్షాలను ఏకం చేసే పనిని శరద్ పవార్ ప్రారంభించాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మలతో సహా పలువురు విపక్ష నేతలు సాయంత్రం పవార్ నివాసంలో సమావేశమయ్యారు. వచ్చేవారం సోనియా నేతృత్వంలో విపక్షపార్టీల భేటీ నిర్వహించనున్నారు. 2004 ఎన్నికలకు ముందు బీజేపీయేతర పక్షాలను ఏకం చేసి యూపీఏను ఏర్పాటుచేయటంలో సోనియా క్రియాశీలకంగా వ్యవహరించారు. పదేళ్లపాటు ఈ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని నడిపేలా అందరినీ ఒకతాటిపై నిలబెట్టిన సంగతి తెలిసిందే.
బీజేపీ అసంతృప్త నేతల భేటీ
గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు, రైతుల అసంతృప్తి వంటి అంశాలపై చర్చించేందుకు వివిధ వర్గాలు, నిపుణులతో ఏర్పాటైన ‘రాష్ట్రీయ మంచ్’ మంగళవారం ఢిల్లీలో భేటీ కానుంది. బీజేపీ అసంతృప్త నేతలైన యశ్వంత్‌సిన్హా, శతృఘ్న సిన్హా సహా పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలపై మోదీ దృష్టిపెట్టలేదని.. మూడున్నరేళ్లలో గ్రామాలు పూర్తిగా నిరాదరణకు గురయ్యాయనే అంశాలను ఈ భేటీ లో చర్చించనున్నారని సమాచారం. ఇటీవలి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ.. కాంగ్రెస్‌తో కాకుండా ఒంటరిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇది కొంతమేర కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మోదీ వ్యూహమేంటో?
అయితే ప్రధాని మోదీ ఎలా ముందుకెళ్తారనే అంశంపై ఎలాంటి స్పష్టత లేనప్పటికీ.. ఏకకాల ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలని ఆయన భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లటం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడకుండా జాగ్రత్తపడాలని, విపక్షపార్టీలన్నీ ఏకమయ్యేందుకు అవసరమైన సమయం ఇవ్వకూడదనేది మోదీ వ్యూహంగా భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే 100 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు మోదీ ఆలోచిస్తున్నారని.. ఇందుకోసం ఎన్నికల ప్రచార నిర్వహణ బృందంతో చర్చిస్తున్నారనే వార్తలూ వినబడుతున్నాయి. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం కూడా ఇన్నాళ్లూ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను చెప్పటంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలాగా ఉందని విశ్లేషకులంటున్నారు. ఇద్దరు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులను ఈ అంశంపై సాక్షి ప్రతినిధి సంప్రదించగా.. ఒకరు ‘ముందస్తు’పై స్పందించేందుకు నిరాకరించారు. మరొకరు ‘కొట్టిపారేయలే’మని.. రాజకీయాల్లో ఒక వారం కూడా కీలకం అని తెలిపారు.
‘ముందస్తు’పైనే చర్చ!
Published Tue, Jan 30 2018 2:14 AM | Last Updated on Mon, Oct 22 2018 9:20 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment