
పట్నా: ఉత్తరప్రదేశ్, బిహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ పరాభవం నేపథ్యంలో సొంత పార్టీపై ఎంపీ శత్రుఘ్న సిన్హా మరోసారి నిప్పులు చెరిగారు. బీజేపీ అధినాయకత్వం అహంకారం, అతి విశ్వాసం, షార్ట్‌టెంపర్ కారణంగానే ఈ పరాభవం ఎదురైందంటూ పరోక్షంగా ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. ‘ప్రజాస్వామ్య రాజకీయాల్లో అహంకారం, అతి విశ్వాసం, అతి కోపం పతనానికి దారితీస్తాయని నేను పదేపదే చెప్తూ వస్తున్నాను. ఇవి ట్రంప్ లేదా, మిత్రోం లేదా, ప్రతిపక్ష నాయకులు ఎవరి నుంచి వచ్చినా ప్రమాదమే’ అని శత్రుఘ్న ట్వీట్ చేశారు. మిత్రోం అంటూ ప్రధాని మోదీ ప్రసంగించే సంగతి తెలిసిందే.
అదేవిధంగా బీజేపీకి రానున్నది కష్టకాలమేనని, ఇప్పటికైనా బీజేపీ అధినాయకత్వం (ప్రధాని మోదీ, అమిత్‌షా) మేలుకోవాలని హితవు పలికారు. ‘మన వ్యక్తులు, శ్రేణులు త్వరగా సీటు బెల్టు సర్దుకోవాల్సిన అవసరాన్ని యూపీ, బిహార్ ఫలితాలు చాటుతున్నాయి. రానున్నది సంక్షోభకాలం. ఈ సంక్షోభం నుంచి ఎంత త్వరగా బయటపడితే.. అంత మంచిదని కోరుకుంటూ మనం ప్రార్థించాలి. ఈ ఫలితాలు మన భవిష్యత్తు గురించి సంకేతాలు ఇస్తున్నాయి. వీటిని తేలికగా తీసుకోకూడదు’ అని ఆయన ట్వీట్ చేశారు.
2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించిన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫుల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎస్పీ, బీఎస్పీ కూటమి ఇక్కడ ఘనవిజయాలు సాధించింది. అటు బిహార్‌లోనూ బీజేపీ-జేడీయూ కూటమిని మట్టికరిపిస్తూ ఆర్జేడీ విజయాలు సాధించింది. ఈ ఫలితాలు బీజేపీ అధినాయకత్వంలో తీవ్ర ఆంతర్మథనానికి కారణయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment