వేల్పనూరు(వెలుగోడు): మాయమాటలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. కేంద్రంతో నాలుగేళ్లు కలిసి ఉండి సాధించని ప్రత్యేకహోదాను ఇప్పుడు తెస్తానంటే నమ్మేదెలా అన్నారు. మీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెబుతారని సీఎంను హెచ్చరించారు.శుక్రవారం వేల్పనూరులో జరిగిన రేగడగూడురు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల నాయకుడు అంబాల ప్రభాకర్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీకి విలువ లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండు చేసిన అప్పటి బీజేపీ నేత వెంకయ్యనాయుడు ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు.
తమను గెలిపిస్తే పదేళ్లు కాదు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా తీసుకొస్తామని వెంకటేశ్వరస్వామి సాక్షిగా తిరుపతి సభలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే ఆయన ప్రత్యేక హోదాను మరిచిపోయారన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. 2016, నవంబర్ 8న కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే అదేరోజు అర్ధరాత్రి చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి స్వాగతించారని, మరుసటి రోజు అసెంబ్లీలో కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను సన్మానించారన్నారు. ఇప్పుడు యూటర్న్ తీసుకొని హోదా కోసం పోరాడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
వైఎస్ జగన్‌ది అలుపెరగని పోరాటం
ప్రత్యేక హోదా సాధనకు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నాలుగేళ్లుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అలుపెరగని పోరాటాలు చేశారని శిల్పాచక్రపాణిరెడ్డి అన్నారు. బంద్‌లు, ధర్నాలు, యువభేరీలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేశారన్నారు. ఆయన వల్లే హోదా నినాదం బతికిందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలతో పదవులకు రాజీనామా చేయించి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయించారన్నారు. మొట్టమొదట కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీ వైఎస్‌ఆర్‌సీపీనే అన్నారు. పోరాటాలతో వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తోందని గ్రహించిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకున్నారని..అయితే ఆయనను ప్రజలు నమ్మరన్నారు.
ఈ నెల 20న చంద్రబాబు ధర్మపోరాటం పేరుతో దీక్ష చేసి రూ.30 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. అంతటితో ఆగకుండా ప్రజలను వంచించేందుకు ఈ నెల 30న తిరుపతిలో సభ పెట్టారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసానికి నిరసనగా అదేరోజు న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విశాఖలో వంచన దినం పాటిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరూ తమ పోరాటానికి మద్దతివ్వాలని శిల్పా కోరారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మండ్ల శంకర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, అమీర్ అలీఖాన్, పెద్ద స్వామన్న, నడిపి స్వామన్న, ఇలియాస్‌ఖాన్, మోతుకూరు నాగేశ్వరరెడ్డి, శ్రీనివాసులు, జనాబా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment