
మహారాష్ట్ర రాష్ట్రపతి పాలన దిశగా వెళితే అది తమ తప్పు కాదని శివసేన స్పష్టం చేసింది.
ముంబై : మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతున్న క్రమంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యమైతే అది శివసేన తప్పిదం కాదని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర రాష్ట్రపతి పాలన దిశగా వెళుతోందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ పరిస్థితికి తాము బాధ్యులం కాదని, ఈ దిశగా కుట్ర పన్నేవారు ప్రజల తీర్పును అవమానిస్తున్నారని బీజేపీ తీరును ఎండగట్టారు.
సీఎం పదవిని పంచుకునే విషయంలో ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేనల మధ్య ఏకాభిప్రాయం ఉందని ఇరు పార్టీల మధ్య అధికార పంపకంపై నెలకొన్న చిక్కుముడిని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి బీజేపీ నుంచి తాజా ప్రతిపాదనలేవీ రాలేదని, తాము కూడా ఎలాంటి ప్రతిపాదనా పంపలేదని సంజయ్ రౌత్ చెప్పారు. గతంలో జరిగిన ఒప్పందం అమలు చేయాలనే తాము కోరుతున్నామని, కొత్త ప్రతిపాదనలేమీ లేవని పేర్కొన్నారు. (చదవండి: త్వరలో శుభవార్త వింటారన్న బీజేపీ)