అధికార పార్టీకి షాక్‌ | Shock to the ruling party | Sakshi
Sakshi News home page

అధికార పార్టీకి షాక్‌

Published Wed, Mar 27 2019 4:35 AM | Last Updated on Wed, Mar 27 2019 4:35 AM

Shock to the ruling party - Sakshi

థాట్రాజ్‌

సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా టీడీపీకి షాక్‌ తగిలింది. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వి.టి.జనార్దన్‌ థాట్రాజ్‌ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. కురుపాం  నామినేషన్లను మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి వి.విశ్వేశ్వరరావు పరిశీలించారు. టీడీపీ అభ్యర్థి థాట్రాజ్‌ ఎస్టీ (కొండదొర) కాదని, 2012లో హైకోర్టు, 2016లో సుప్రీంకోర్టు తీర్పులిచ్చాయని, ఇప్పుడెలా పోటీకి అర్హుడవుతాడని బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజు అభ్యంతరం తెలిపారు. ఇరువైపుల వాదనలు, ధ్రువపత్రాలు పరిశీలించిన అనంతరం జనార్దన్‌ థాట్రాజ్‌ ఎస్టీ కాదని ఇదివరకే కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. టీడీపీ తరఫున డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన థాట్రాజ్‌ తల్లి నరిసింహ ప్రియ థాట్రాజ్‌ పోటీలో ఉంటారని తెలిపారు. నరసింహప్రియ థాట్రాజ్‌పైనా కుల వివాదం ఉన్నందున ఏం జరుగుతుందోనని టీడీపీ ఆందోళన పడుతోంది. సాలూరులోనూ టీడీపీ అభ్యర్థి ఆర్‌పి భంజ్‌దేవ్‌ ఎస్టీ కాదంటూ గతంలో కోర్టు తీర్పునివ్వడంతోపాటు అతని ఎన్నికను రద్దుచేసింది. మళ్లీ అతనికే టీడీపీ టిక్కెట్టు ఇచ్చింది. 

నర్సీపట్నం జనసేన అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ
విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వేగి దివాకర్‌రావు అఫిడవిట్‌ అసంపూర్తిగా నింపారనే కారణంతో ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి ఆర్‌. గోవిందరావు తిరస్కరించారు. ఈ స్థానానికి మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాపను పార్టీలోకి తీసుకొచ్చి టిక్కెట్‌ ఇవ్వాలని జనసేన నేతలు ప్రయత్నించారు. ముత్యాలపాప రానిపక్షంలో బయపురెడ్డి అశోక్‌కు టిక్కెట్‌ వస్తుందని ఆశించారు. అయితే చివరి నిమిషంలో పరవాడకు చెందిన దివాకర్‌రావుకు టిక్కెట్‌ లభించింది. నామినేషన్ల ఆఖరిరోజు దివాకర్‌రావు హడావుడిగా  నామినేషన్లు వేశారు. అదికాస్తా తిరస్కరణకు గురైంది. 

పలు జిల్లాల్లో నామినేషన్ల తిరస్కరణ..
రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు మంగళవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరించారు. పలు జిల్లాల్లో పరిస్థితిదీ..
- అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 254 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 190  ఆమోదం పొందాయి. ధర్మవరం స్థానానికి 27 నామినేషన్లు రాగా వాటిలో 15 తిరస్కరణకు గురయ్యాయి. పుట్టపర్తిలో 7 నామినేషన్లను తిరస్కరించారు. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గానికి 18 మంది నామినేషన్‌ దాఖలు చేయగా 14 ఆమోదం పొందాయి. హిందూపురం పార్లమెంట్‌ స్థానానికి 12 నామినేషన్లు దాఖలవగా.. 9 నామినేషన్లను ఆమోదించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గానికి మొత్తం 17 నామినేషన్లు దాఖలవగా వాటిలో నాలుగింటిని తిరస్కరించారు. బాపట్ల పార్లమెంట్‌కు 16 నామినేషన్లు దాఖలవగా రెండింటిని తిరస్కరించారు. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 237 నామినేషన్లు దాఖలవగా.. 65 నామినేషన్లను తిరస్కరించారు.  
విజయనగరం పార్లమెంటు స్థానంతోపాటు జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాలకు 132 నామినేషన్లు దాఖలవగా.. 28 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 
వైఎస్సార్‌ జిల్లాలో కడప లోక్‌సభ నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్లలో పదిహేడింటిని ఆమోదించగా, ఏడు తిరస్కరణకు గురయ్యాయి. రాజంపేట లోక్‌సభ స్థానానికి 12 నామినేషన్లు ఆమోదం పొందగా.. ఎనిమిదింటిని తిరస్కరించారు. పది అసెంబ్లీ స్థానాలకు  161 నామినేషన్లు ఆమోదం పొందగా.. 54 తిరస్కరణకు గురయ్యాయి. 
గుంటూరు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అన్నపురెడ్డి అంజిరెడ్డి దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విషయాన్ని స్థానిక అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తున్నట్లు న్యాయవాది బాలసత్యనారాయణరెడ్డి తెలిపారు.
కృష్ణా జిల్లాలోని పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేశారు. పెనమలూరులో టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాల విషయంలో న్యాయపరమైన అభ్యంతరాలు రావటంతో వాటిని పరిశీలించాల్సి ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement