ఎంపీ తోట నరసింహం, తోట వాణి
కాకినాడ/జగ్గంపేట: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూర్పుగోదావరి జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. లోక్‌సభలో టీడీపీ పక్షనేత, కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం టీడీపీకి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం కాకినాడలోని తన నివాసంలో అభిమానులు, సహచరుల అభీష్టం మేరకు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. తోట సోదరుడు, మాజీ ఎమ్మెల్యే తోట వెంకటాచలం మరణంతో 2003లో తోట నరసింహం రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో జగ్గంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2005 నుంచి 2010 వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తోట 2010లో కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా సేవలందించారు. 2014లో కాంగ్రెస్‌ను వదిలి టీడీపీ తరపున కాకినాడ ఎంపీగా గెలుపొందారు. టీడీపీ లోక్‌సభా పక్షనేతగా, వివిధ కేంద్ర అనుబంధ కమిటీలకు సభ్యునిగా సేవలందించారు.
నేడు వైఎస్సార్‌సీపీలో చేరిక
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ తోట నరసింహం బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తన సతీమణి తోట వాణి, సన్నిహితులతో కలిసి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్టు తోట నరసింహం ప్రకటించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన అనుచరులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేటలో వలస నేత జ్యోతుల నెహ్రూను ఓడించాలని ప్రజలకు తోట నరసింహం పిలుపునిచ్చారు.
యనమల, చినరాజప్పపై ‘తోట’ ఆగ్రహం
రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పపై తోట వాణి నిప్పులు చెరిగారు. ఆమె మంగళవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన తమ కుటుంబాన్ని అణగదొక్కేందుకు చినరాజప్ప ప్రయత్నించారని ఆరోపించారు. మరణించిన తన తండ్రి, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణను పలు ఇంటర్వ్యూల్లో అవమానకరంగా సంబోధించారని, మరెన్నో విధాలుగా తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. మంత్రి యనమల తీరుపై కూడా ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలన్న జ్ఞానం లేని జిల్లాలో ఓ పెద్దాయనకు అది బలుపో, బద్ధకమో తెలియడం లేదంటూ చురకలంటించారు. తన భర్త అనారోగ్యంతో ఉంటే కనీసం పలకరించలేదని టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఆ పార్టీ నేతల్లో కనీసం మానవత్వం కూడా లేకపోయిందని ధ్వజమెత్తారు.
కష్టపడినా టీడీపీలో గుర్తింపు లేదు!
తెలుగుదేశం పార్టీ, కాకినాడ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు తోట నరసింహం ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలోని తన నివాసంలో మంగళవారం రాత్రి కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో టీడీపీ తరపున పోరాటం చేసి, అనారోగ్యం బారిన పడ్డానని, కష్టించి పనిచేసినా తనకు గుర్తుంపు ఇవ్వలేదని వాపోయారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. తాను ఈ ఎన్నికల్లో అనారోగ్యం కారణంగా పోటీ చేయలేకపోతున్నానని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధిష్టానం నిర్ణయం మేరకు తమ కుటుంబం నడుచుకుంటుందని, తమకు అప్పగించిన బాధ్యతలు నెరుస్తామని వెల్లడించారు.
‘పర్వత’ కుటుంబం గుడ్‌బై..
మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు.1999లో ఆమె టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి అదేపార్టీలో కొనసాగుతున్నారు. ఆమె భర్త పర్వత సుబ్బారావు 1994లో ఎమ్మెల్యేగా సేవలందించారు. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంతోపాటు మెట్ట ప్రాంత రాజకీయాల్లో ‘పర్వత ’ కుటుంబానికి గట్టి పట్టుంది. టీడీపీని వీడాలని పర్వత బాపనమ్మ మంగళవారం నిర్ణయించుకున్నారు. ఆమెతోపాటు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు సోదరుడు రాజబాబు, ఆయన భార్య జానకీదేవితోపాటు వారి అనుచరులు సైతం టీడీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ రెండు పరిణామాలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి.
Comments
Please login to add a commentAdd a comment