కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సోమవారం కాంగ్రెస్ ప్రకటించిన 218 అభ్యర్థుల జాబితా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పలుకుబడి, శక్తిసామర్ధ్యాలకు అద్దంపడుతోంది. మొదట రెండు సీట్ల నుంచి పోటీచేయాలనుకున్న ముఖ్యమంత్రికి ఒక్క చాముండేశ్వరి స్థానం నుంచే పోరుకు అవకాశం కల్పించినా అత్యధిక సంఖ్యలో తన అనుచరులకు ఆయన టికెట్లు సాధించారు. జేడీఎస్, బీజేపీ, ఓ చిన్న పార్టీ నుంచి ఫిరాయించిన పదిమందికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చేలా అధిష్టానాన్ని ఆయన ఒప్పించగలిగారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 112 మందికి మళ్లీ పోటీచేసే అవకాశం లభించగా, కేవలం పది మందికే టికెట్ నిరాకరించారు. టికెట్లు దక్కని కాంగ్రెస్ నేతలు అప్పుడే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. సీఎంతో పాటు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కీలక మంత్రి డీకే శివకుమార్, పీసీసీ నేత జి.పరమేశ్వర కూడా తమ మద్దతుదారులకు కాంగ్రెస్ జాబితాలో తగినన్ని సీట్లు సంపాదించారు. కిందటిసారి పది మంది మహిళలకు కాంగ్రెస్ టికెట్ల లభించగా ఈసారి వారికి రికార్డు సంఖ్యలో 15 సీట్లు దక్కాయి. మొత్తం 224 సీట్లలో దాదాపు వంద నియోజకవర్గాల్లో గెలుపోటములు నిర్ణయించే బలమైన సామాజికవర్గమైన లింగాయతులకు ఎప్పటిలా పెద్ద సంఖ్యలో స్థానం కల్పించారు.
నలుగురు నేతల కుటుంబసభ్యులకు టికెట్లు
కిందటేడాది పంజాబ్ ఎన్నికల్లో అనుసరించిన ‘ఒక కుటుంబానికి ఒక టికెట్’ అనే సూత్రానికి కర్ణాటకలో కనీసం నాలుగు చోట్ల మినహాయింపు ఇచ్చి నేతల కుటుంబసభ్యులకు పోటీచేసే అవకాశం కల్పించారు. సిద్దరామయ్య కొడుకు యతీంద్రకు వరుణ టికెట్ లభించింది. రాష్ట్ర హోం మంత్రి ఆర్. రామలింగారెడ్డి(పాత సీటు బీటీఎం లేఅవుట్ నుంచి) కుమార్తె సౌమ్యారెడ్డికి బెంగళూరు నగరంలోని జయనగర్ టికెట్ కేటాయించారు. న్యాయశాఖా మంత్రి టీబీ జయచంద్ర, ఆయన కొడుకు సంతోష్‌కు వరుసగా సీరా, సికనాయకనహళ్లి(తుమకూరు జిల్లా) నుంచి పోటీచేస్తారు. గృహనిర్మాణ మంత్రి ఎం.కృష్ణప్ప(గోవిందరాజనగర్) కుమారుడు ప్రియాకృష్ణకు కూడా విజయ్‌నగర్ సీటు కేటాయించారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ కేహెచ్ మునియప్ప కూతురు రూపా శశిధర్‌కు కోలార్ నుంచి పోటీచేసే అవశం ఇచ్చారు. ఇంకా మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, ఐటీ మంత్రి ప్రియాంక్‌కు మళ్లీ గుల్బర్గా జిల్లా చిత్తాపూర్ టికెట్ కేటాయించారు. కిందటేడాది మరణించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖమరుల్ ఇస్లాం, మహదేవ ప్రసాద్ భార్యలకు వారి భర్తల సీట్ల నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు. కొన్ని నెలల క్రితం మరణించిన ఎమ్మెల్యే రుద్రేశ్ గౌడ కూతురు కీర్తనకు కూడా కాంగ్రెస్ టికెట్ (బేలూరు) ఇచ్చారు.
లింగాయతులకు 40, ముస్లింలకు 15
ప్రత్యేక మతంగా గుర్తింపు కోసం పోరాడి సాధించిన బలమైన సామాజికవర్గం లింగాయతులకు 40, ఒక్కళిగలకు దాదాపు 25, ముస్లింలకు 15, ఐదుగురు బ్రాహ్మణ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్లు లభించాయి. బీసీలకు 50కు పైగా సీట్లు, స్వల్ప జనాభా ఉన్న అగ్రకులాలు కొడవ, బంట్, వైశ్యులకు ఐదు టికెట్లు కేటాయించారు. ఒక జైన సభ్యునితోపాటు ఇద్దరు ప్రస్తుత క్రైస్తవ ఎమ్మెల్యేలకు కూడా మళ్లీ పోటీచేసే అవకాశం దక్కింది. షెడ్యూల్డ్ కులాలలోని దళిత వర్గాలు రెండింటికీ సమాన ప్రాధాన్యం కల్పించారు.
ఏడుగురు జేడీఎస్ ఫిరాయింపుదారులకు అవకాశం!
కాంగ్రెస్‌లో చేరిన ఏడుగురు జేడీఎస్ ఎమ్మెల్యేలు, సొంత పార్టీ కర్ణాటక మక్కల్ పక్షపై కిందటి ఎన్నికల్లో గెలిచిన వివాదాస్పద వ్యాపారి అశోక్ ఖేనీ(బీదర్ దక్షిణ)కు కూడా కాంగ్రెస్ టికెట్లు లభించాయి. బళ్లారి ప్రాంతంలో ఇద్దరు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలైన వివాదాస్పద వ్యాపారులు ఆనంద్ సింగ్, బి.నాగేంద్ర కాంగ్రెస్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. బీజేపీ మాజీ సీఎం బీఎస్ యెడ్యూరప్ప 2013లో స్థాపించిన కేజేపీ టికెట్‌పై గతంలోగెలిచిన బీఆర్ పాటిల్‌కు కూడా హస్తం గుర్తుపై పోటీచేసే అవకాశం లభించింది.
బీజేపీ కొత్త అభ్యర్థులపై కాంగ్రెస్ హేమీహేమీలు
కోస్తా జిల్లా దక్షిణ కన్నడలోని ఏడు స్థానాల్లో బీజేపీ చాలా వరకు ఎన్నికల రాజకీయాలకు కొత్త అయిన అభ్యర్థులే కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులతో తలపడాల్పిన పరిస్థితి. కాంగ్రెస్ ఏడుగురు సిటింగ్
సభ్యులందరికీ మళ్లీ సీట్లిచ్చింది. జిల్లాలోని 8 స్థానాల్లో ఏడింటిని కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఏడుగురిలో ఇద్దరు బి.రామనాథ్‌రాయ్(బంట్వాల్), యూటీ ఖాదర్(మంగళూరు), అభయచంద్ర
జైన్(మూడబిద్రి) ఒకటి రెండు సందర్భాల్లో మంత్రులుగా పనిచేసినవారే. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఖాదర్ ఓటమి ఎరగని నేత. జైన్ ఈసారి పోటీకి సుముఖుంగా లేకున్నా మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చారు. మతవిద్వేషాలు తలెత్తే ఈ జిల్లాలో ఆరెసెస్‌కు గట్టి పునాదులున్నప్పటికీ, బీజేపీకి పేరున్న నేతలు లేని కారణంగా ఏడు సీట్లకు అందరూ కొత్తవారే పోటీపపడాల్సిన పరిస్థితి. మొదటి 72 మంది జాబితాలో ఈ ఏడు సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదు.
బెంగళూరు మేయర్‌కు టికెట్
బెంగళూరు కాంగ్రెస్ మేయర్ ఆర్.సంపత్‌రాజ్‌కు నగరంలోని సీవీ రామన్ నగర ఎస్సీ రిజర్వ్‌డ్ సీటు కేటాయించారు. ఆయనకు ముందు మేయర్‌గా పనిచేసిన పద్మావతికి దక్షిణ బెంగళూరులోని రాజాజీ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీచేసే అవకాశం కల్పించారు. ఆమెపై ఇక్కడ బీజేపీ సీనియర్ నేత ఎస్.సురేష్ కుమార్ పోటీకి దిగుతున్నారు. నగరంలోని సంపన్న ప్రాంతం జయనగర్‌లో హోం మంత్రి కూతురు సౌమ్యారెడ్డికి కాంగ్రెస్ టికెట్ లభించగా, బీజేపీ అభ్యర్థిత్వం బీఎన్ విజయ్‌కుమార్‌కు దక్కింది.
బళ్లారి సిటీలో సోమశేఖర్‌రెడ్డిపై అనిల్ హెచ్ లాడ్ పోటీ
బళ్లారి సిటీ కాంగ్రెస్ టికెట్ మైనింగ్ వ్యాపారి అనిల్ హెచ్ లాడ్‌కు దక్కగా, ఆయనపై పోటీకి గాలి జనార్దన్‌రెడ్డి సోదరుడు జి.సోమశేఖర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తారు. సోమవారం బీజేపీ ప్రకటించిన రెండో జాబితా(82)లో సోమశేఖర్ అభ్యర్థిత్వంవెల్లడించారు. గాలి కుటుంబానికి సన్నిహితుడైన సన్నా ఫకీరప్పకు బళ్లారి(ఎస్టీ) టికెట్ కేటాయించగా, ఆయనపై కాంగ్రెస్ తరఫున బి.నాగేంద్ర పోటీచేస్తారు.
-- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment