సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులు, ప్రజల ఇబ్బందులపై సీఎం కేసీఆర్‌ను కలిసి విన్నవించాలని వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ నేతల్లో.. కొందరిని శుక్రవారం పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచగా, మరికొందరిని అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు రాజాసింగ్‌ను పోలీసులు శుక్రవారం ఉదయం నుంచే గృహ నిర్బంధంలో ఉంచారు. అలాగే బీజేపీ శాసన మండలి పక్ష నేత ఎన్. రామచందర్‌రావును అరెస్ట్ చేశారు. దీనిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సీఎంను విపక్ష పార్టీల నేతలు కలవడం ప్రజా సమస్యలను వివరించి పరిష్కరించడానికి కృషి చేయడం ప్రజాస్వామ్యంలో ఒక భాగమన్నారు. అనేక నిరసన కార్యక్రమాలతోపాటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని, మంత్రులను కలవడం సర్వసాధారణమన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఎవరికి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం, సమస్యలను ఎత్తిచూపితే దాడి చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి మంచిది కాదని పేర్కొన్నారు. ప్రజల తరఫున పోరాటం చేయడానికి బీజేపీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, అరెస్టులకు, ఎదురు దాడులకు భయపడదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment