
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో గురువారం ప్రతిపక్ష నాయకులు సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అధికార బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహ రచన, ఐక్యత సాధించడంపై చర్చ జరిగినట్లు తెలిసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో మాదిరిగా 17 ప్రతిపక్ష పార్టీలను ఏకతాటి పైకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే తాజా భేటీ జరిగింది. బీఎస్పీ మినహా మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. విభేదాలు పక్కనపెట్టి జాతీయ ప్రయోజనాల కోసం ఐకమత్యంతో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని సోనియా పిలుపునిచ్చారు. పార్లమెంట్ లోపలా, బయటా ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి వ్యూహం అనుసరించాలన్నారు. పార్టీల మధ్య విభేదాలు ఉండొచ్చు కానీ జాతీయ ప్రయోజనాలకొచ్చే సరికి మాత్రం ఒకే వైఖరి అవలంబించాలన్నారు. మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయికి చేరుకుందన్నారు. భేటీ ముగిసిన తరువాత కాంగ్రె స్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.
ఏడు పార్టీల నాయకులతో కమిటీ ఏర్పాటు...
ట్రిపుల్ తలాక్ బిల్లు, సుప్రీంకోర్టు అంతర్గత సంక్షోభం, ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మత ఘర్షణలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏడు పార్టీలకు చెందిన నాయకులతో ఒక కమిటీని ఏర్పాటుచేశారు. ప్రతిపక్షాల మధ్య ఐకమత్యం కొనసాగేందుకు ఈ కమిటీ కృషిచేస్తుంది. సమావేశానికి హాజరైన వారిలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ తరఫున జయ్ ప్రకాశ్ నారాయణ్ యాదవ్, తృణమూల్ నాయకుడు డెరెక్ ఒబ్రియాన్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, ఎస్పీ నాయకుడు రామ్‌గోపాల్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment