కర్ణాటక ఎన్నికలు: తెరపైకి అసలు పేర్లు | Sonia Gandhi And Yogi Adithyanath Real Names in Karnataka Elections | Sakshi
Sakshi News home page

Published Tue, May 8 2018 2:28 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Sonia Gandhi And Yogi Adithyanath Real Names in Karnataka Elections - Sakshi

యోగి ఆదిత్యానాథ్‌.. సోనియా గాంధీ

సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ, సీఎం సిద్ధరామయ్యలపై బీజేపీ అవినీతి ఆరోపణలు.. ప్రతిగా ప్రధాని మోదీ, బీజేపీలకు సిద్ధరామయ్య లీగల్‌ నోటీసులు పంపటం తెలిసిందే. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధినేత్రి  సోనియా గాంధీ ప్రచారంలో పాల్గొంటుండటంతో బీజేపీ విమర్శల డోస్‌ను పెంచింది. ఆమె అసలు పేరును తెరపైకి తెచ్చి విమర్శలు గుప్పించింది. 

‘ఆంటోనియో మైనో(సోనియాగాంధీ అసలు పేరు) ఇవాళ కర్ణాటకకు వచ్చారు. మిగిలిన ఏకైక కంచుకోటను రక్షించుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మేడమ్‌ మైనో.. పదేళ్లు అధికారంలో ఉండి దేశం విలువైన సమయాన్ని వృథా చేసిన వ్యక్తుల నుంచి కర్ణాటక గుణపాఠం నేర్చుకోవాలనుకోవట్లేదు’ అంటూ కర్ణాటక బీజేపీ ట్వీటర్‌ పోస్టు చేసింది. అయితే అంతకు ముందు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అసలు పేరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఓ ట్వీట్‌ చేసింది.

‘సుపరిపాలన అంటే ఏంటో అజయ్‌ బిష్ట్‌(సన్యాసం స్వీకరించకముందు యోగి అసలు పేరు) సిద్ధరామయ్యగారి నుంచి నేర్చుకోవాలి. తద్వారా యూపీ ప్రజలకు ఆపద సమయంలో అది ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్వీటర్‌లో ఓ పోస్టు చేసింది. దానికి ప్రతిగానే సోనియా ప్రస్తావనను బీజేపీ తీసుకొచ్చింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇరుపార్టీల మధ్య పోటాపోటీ పోస్టులతో విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. కర్ణాటక అసెంబ్లీకి మే 12న ఎన్నికలు జరగనుండగా.. 15వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement