
వాజపేయితో మోదీ (పాత చిత్రం)
ముంబై : లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా నిరాకరించి, వీలుచిక్కినప్పుడల్లా గాంధీ-నెహ్రూ కుటుంబాలపై విమర్శలు గుప్పించే ప్రధాని నరేంద్ర మోదీ తీరును కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ తప్పుపట్టారు. ‘‘2014, మే 26 (మోదీ బాధ్యతలు స్వీకరించిన రోజు) కంటే ముందు దేశంలో అసలు అభివృద్ధే జరగలేదన్నట్లు, గడిచిన నాలుగేళ్లలోనే అంతా సాధించినట్లు మాట్లాడటం జాతిని అవమానించినట్లే’’నని అభిప్రాయపడ్డారు.
శుక్రవారం ‘ఇండియా టుడే ముంబై కంక్లేవ్’లో మాట్లాడిన ఆమె.. వాజపేయి-మోదీల మధ్య తేడాను ఎత్తిచూపారు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలాంటి పార్లమెంటరీ వ్యవస్థను వాజపేయిగారు అమితంగా గౌరవించేవారని, ప్రస్తుత ప్రధాని మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఏకపాత్రగా పరిగణిస్తున్నారని, అసమ్మతి, చర్చలు ఉంటాయనే స్ఫృహను మర్చిపోయారని, వాజపేయికి-మోదీకి మధ్య ప్రధానమైన తేడా ఇదేనని సోనియా అన్నారు.
లీడర్ కన్నా మంచి రీడర్ నేను : ‘ఒక పార్టీకి అధ్యక్షురాలిగా నా పరిధి ఏమిటనేది స్పష్టంగా తెలుసు. నేను మంచి వక్తను కానని ఒప్పుకోవడానికి వెనుకాడను. నన్ను లీడర్ అనేకన్నా మంచి రీడర్ అంటే సబబుగా ఉంటుందేమో(నవ్వులు)’ అని చమత్కరించిన సోనియా.. తనకంటే మన్మోహన్ సింగ్ సమర్థుడైన నాయకుడని కితాబిచ్చారు.
కొత్త శైలితోనే కాంగ్రెస్‌కు జీవం : 2014 ఎన్నికల తర్వాత కాంగ్రస్ పార్టీ వరుస వైఫల్యాలపై సోనియా కుండబద్దలుకొట్టినట్లు మాట్లాడారు. ‘‘అవును. మేం మార్కెట్ నుంచి తోసేయబడ్డాం (We were out-marketed) ఇప్పుడు సరికొత్త శైలి(a new style)తో మళ్లీ ప్రజలతో మమేకం అవుతాం. పార్టీ విధివిధానాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళతాం’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment