ప్రకాశ్‌రాజ్, ఉపేంద్ర,
వెండితెరపై అలవోకగా సాహసకృత్యాలను పండించే నటీనటులు నిజజీవిత రాజకీయాల్లోను, ఎన్నికల్లోను కూడా అదే హవా కొనసాగించాలని రావడం, వారిలో కొందరంటే కొందరే ప్రజామోదం పొందడం జరుగుతోంది. ఎక్కువమంది నటీనటులు పెద్ద ప్రభావం చూపకుండానే రాజకీయాలను చాలించుకోవడం విశేషం.
సాక్షి, బెంగళూరు: ఎన్నికలు వస్తే చాలు రాష్ట్ర రాజకీయా ల్లో సినీ స్టార్లు తళుక్కున మెరుస్తుండడం సహజం. కానీ అలా రాజకీయాల్లోకి మెరుపులా వచ్చి మాయమవుతున్నవారే అధికంగా ఉన్నారు. బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్ కొన్ని నెలలుగా బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శల యుద్ధం ప్రారంభించి తాజాగా బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గతంలో కూడా ఇక్కడ పలువురు ఐటీ, పారిశ్రామిక ప్రముఖులు పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు. ప్రకాశ్ రాజ్ భవితవ్యం ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా లేక చాలా మందిలా మళ్లీ సినిమాలకు వెళ్లిపోతారా? అని కొందరు ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.
ఊరించిన ఉపేంద్ర
ఇక శాండల్‌వుడ్‌లో విలక్షణ నటుడు ఉపేంద్ర రాజకీయాల్లో రియల్‌స్టార్‌లా సత్తా చూపలేకపోతున్నారు. ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ) ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో నిలిపారు. వీరిలో ఎక్కువమంది పెద్దగా ఊరూపేరు లేనివారే. దీంతో ఎన్నికలపై ప్రభావం చూపలేకపోతున్నారని చెప్పాలి.
మండ్యలో వార్
ఇక ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం మండ్య నియోజకవర్గమనే చెప్పాలి. రెబెల్‌స్టార్ సతీమణి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తుండడం, ఆమెకు బీజేపీ మద్దతిస్తుండడం సంచలనంగా మారింది. ఆమె పోటీదారు, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కూడా వర్ధమాన హీరోనే. ప్రచారంలో హోరాహోరీగా తలపడుతున్నారు.
- వీరితో పాటు చాలా మంది గతంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వెండితెరపై మెరిసిన చాలా మంది రాజకీయాల్లో హిట్లు కొట్టలేకపోయారు.
- అంబరీశ్ రాజకీయాల్లో విజయం సాధించారు. అంబరీశ్ కేంద్రం,రాష్ట్రంలో మంత్రిగా పనిచేశా రు .అంతేకాకుండా పలుమార్లుఎన్నికల్లో గెలిచారు.
- ప్రముఖ నటి రక్షిత బీఎస్‌ఆర్ పార్టీలో చేరారు. తరువాత రాజకీయాల్లో కనిపించలేదు.
- పూజాగాంధీ జేడీఎస్ పార్టీలో చేరి కొద్దిరోజులు హల్‌చల్ చేశారు. పలు ఎన్నికల్లో ప్రచారం చేసినా తరువాత రాజకీయాల నుంచి దాదాపు దూరమయ్యారు.
- నటులు శ్రీనాథ్, జగ్గేశ్, చంద్రు, తారా, శ్రుతి, మాళవిక వంటివారు బీజేపీలో తగిన స్థాయిలో పేరు తెచ్చుకున్నారు.
- ఉమాశ్రీ, జయమాల వంటి వారు ఇప్పటికీ విజయాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు.
- శాండల్‌వుడ్ సీనియర్ నటుడు అనంత్‌నాగ్ గతంలో జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా జేహెచ్ పటేల్, రామక్రిష్ణ హెగ్డే వంటి ముఖ్యమంత్రులతో సన్నిహితుడిగా పేరుపొందారు.
- మండ్య మాజీ ఎంపీ రమ్య కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సోషల్ మీడియా విభాగం చీఫ్‌గా ట్విట్టర్‌లో కాక పుట్టిస్తుంటారు.
- చిత్రదుర్గ మాజీ ఎంపీ శశికుమార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద పనిచేస్తూ కొనసాగుతున్నారు.
- కొన్ని సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించిన ఎమ్మెల్యే ఇప్పుడు బీసీ పాటిల్ మంత్రి పదవి కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు.
- స్టార్ హీరోలు యశ్, దర్శన్ ఈ ఎన్నికల్లో సుమలత తరఫున మండ్యలో జేడీఎస్, కాంగ్రెస్‌లను ఢీకొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment