సాక్షి, జన్నారం : అవినీతికి పాల్పడి.. జైలుకు వెళ్లిన లాలూప్రసాద్‌యాదవ్‌కు పట్టిన గతే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పడుతుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పైడిపెల్లిగార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎముకలేని నాలుకతో అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ‘గ్రామజ్యోతి అంటూ అధికారులను గ్రామాల్లో పరుగులు పెట్టించారు.
జిల్లాకు రూ.8వేల కోట్ల వరకు అవుతుందనే భయంతో దానిని పక్కన పెట్టారు. మన ఊరు, మన ప్రణాళిక’ తీసుకొచ్చారు. అదికూడా డబ్బుతో కూడుకున్నదని గ్రహించి దానిని పక్కనబెట్టారు. ఇప్పుడు 30 రోజుల ప్రణాళిక అని అధికారులను గ్రామాల్లో పరుగులు పెట్టిస్తున్నారు..’అని విమర్శించారు. మోసాలతో ఉద్యమాలు నడిపి, మోసాలతోనే పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచదేశాలు ప్రధాని నరేంద్రమోదీని పొగుడుతున్నాయని, కానీ.. కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో బీజేపీ బలవంతంగా నాలుగు సీట్లు గెలిచాయంటూ హేళన చేస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలు కేసీఆర్‌ను బయటకు పంపే రోజులొస్తాయని తెలిపారు.
ఎన్నికల సమయంలో అందరికీ రైతుబంధు డబ్బులు జమ చేయించిన కేసీఆర్.. ఇప్పుడెందుకు ఆలస్యం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రుణమాఫీపైనా స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారన్నారు. అప్పులతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తామని, రానున్న రోజుల్లో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.
ఎంపీ దృష్టికి జర్నలిస్టుల సమస్యలు
జర్నలిస్టుల సమస్యలను ఎంపీ సోయం దృష్టికి తీసుకెళ్లారు. జన్నారం ప్రెస్‌క్లబ్ తరఫున వినతిపత్రం అందించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇళ్లు నిర్మించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు మల్లారెడ్డి, రమాదేవి, కృష్ణ జలాల కమిటీ చైర్మన్ రావుల రాంనాథ్, రాష్ట్ర నాయకుడు మున్నరాజు సిసోడియా, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి సట్ల అశోక్, జన్నారం మండల అధ్యక్షుడు గోలి చందు, బీజేవైఎం నాయకులు కొండపల్లి మహేశ్, మండల నాయకులు సూర్యం, వీరాచారి, సుగుణ, కవిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment