ఆ విషయం కన్నాకు చివరివరకు తెలియదు! | Special Story on Kanna Laxminarayana Political Career | Sakshi
Sakshi News home page

కన్నా లక్ష్మీనారాయణ ఫెయిలయ్యారా?

Published Sat, Aug 3 2019 11:26 AM | Last Updated on Sat, Aug 3 2019 2:20 PM

Special Story on Kanna Laxminarayana Political Career - Sakshi

ఆయన సీనియర్‌ రాజకీయనాయకుడు. అంతేకాదు బలమైన సామాజిక వర్గాన్నికి చెందిన నేత.  కానీ రాజకీయ వ్యూహాలను రచించటంలో మాత్రం వెనుకపడిపోయారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్ధంకాక తికమక పడుతున్నారు. దాంతో అధిష్టానం ఆగ్రహంగా వున్నట్టు చెబుతున్నారు. ఎందుకు అలా ? ఇంతకు ఆయన ఎదుర్కొంటున్న సమస్యలేంటి?

పరిచయం అక్కర్లేని పొలిటీషియన్ కన్నా లక్ష్మీనారాయణ. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. అంతేకాదు ఒక దశలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడిన నేతల్లో ఈయన పేరు కూడా బలంగా వినిపించింది. అయితే అప్పుడు కాలం కలిసి రాలేదు. కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలు కన్నా లక్ష్మీనారాయణను ఎదగనియ్యకుండా చేశాయి. ఆ తర్వాత  రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ సైలెంట్‌గా వెళ్లి బీజేపీలో చేరారు. దీనికి బలమైన కారణముంది. గుంటూరు రాజకీయాల్లో కన్నా లక్ష్మీనారాయణ, రాయపాటి సాంబశివరావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు వీరిద్ధరి మధ్య వార్ పీక్ స్టేజిలో ఉండటం, ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవటంతో రాయపాటి సాంబశివరావు కక్ష సాధింపునకు దిగుతారనే భయం లక్ష్మీనారాయణను నిలవనీయలేదు. దీంతో మూడో కంటికి తెలియకుండా రాత్రికి రాత్రే ఢిల్లీ వెళ్లి కాషాయం కండువా కప్పుకున్నారు.

అప్పట్లో టీడీపీ, బీజేపీల మధ్య సఖ్యత ఉండటంతో కన్నా లక్ష్మీనారాయణను రాయపాటి సాంబశివరావు ఏమీ చేయలేకపోయారు. తర్వాత జరిగిన పరిణామాలు, 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ పెద్దలు.. ఆంధ్రప్రదేశ్‌లో కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలను అప్పగించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో ఆయన ద్వారా రాష్ట్రంలోని కాపు నాయకులు, ఇతర ప్రముఖులు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం ఆలోచించింది. కానీ కన్నా లక్ష్మీనారాయణ వల్ల అది సాధ్యం కాలేదు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసినవారు ఎవరూ గెలవలేకపోయారు. దాంతో రాష్ట్రంలో బీజేపీని నిలబెట్టడంలో కన్నా  విఫలం అయ్యారన్న ఆలోచనలో బిజెపి అధిష్టానం ఉన్నట్టు సమాచారం.

రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వాలను నమోదు చేయించాలని బీజేపీ ఢిల్లీ నేతలు కన్నా లక్ష్మీనారాయణకు టార్గెట్‌ పెట్టినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, టార్గెట్‌ అందుకోవడంలో కూడా విఫలం అయ్యారని, రాష్ట్రమంతా తిరిగినా కేవలం ఎనిమిది లక్షల కంటే సభ్యత్వాలు నమోదు కాలేదని పార్టీ వర్గాల సమాచారం. అలాగే టీడీపీ నుంచి బీజేపీలో చేరే నేతల గురించి కూడా రాష్ట్ర అధ్యక్షుడైన కన్నా లక్ష్మీనారాయణకు తెలియడం లేదు. సైకిల్ పార్టీ నుంచి నలుగురు రాజ్యసభ ఎంపీలు కాషాయం కండువా కప్పుకున్న సంగతి కన్నాకు చివరి నిమిషం దాకా తెలియని పరిస్థితే దీనికి నిదర్శనమని చెప్పుకుంటున్నారు. సరే.. జరిగిందేదో జరిగిందనుకున్నా.. ఆ తర్వాత కూడా  బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు ఎవరూ కన్నాను కనీసం మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు. వాస్తవానికి కేంద్ర స్థాయిలో పార్టీలో చేరే రాష్ట్ర నేతలు.. రాష్ట్ర అధ్యక్షుడిని కలవటం అనేది సర్వసాధారణం. కానీ కన్నా విషయంలో వారు అసలు పట్టించుకోనట్లే వ్యవహరించటం పలు అనుమానాలకు తావిస్తోందని రాజకీయ విశ్లేషకులుకు అంటున్నారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే వారు కన్నాను కలవలేదన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి.

తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన పార్టీల నుంచి చేరికలు ఉన్నప్పటికీ వారంతా రాష్ట్ర అధ్యక్షుడైనా కన్నాను పట్టించుకోకుండా నేరుగా ఢిల్లీ పెద్దలతో లాబీయింగ్ చేసుకుని జాయిన్ అవుతున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక విషయాను చూస్తే బీజేపీలో కన్నా పరిస్థితి మైనస్‌లో పడిందని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా కన్నాకు మరో ఎనిమిది నెలల సమయమే ఉంది. ఆ తర్వాత కన్నాను పక్కన పెట్టాలనే ఢిల్లీ పెద్దలు నిర్ణయించారని పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. రాజకీయాల్లో ఎంతో సీనియర్‌ అయిన కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి ప్రస్తుతం బీజేపీలో అగమ్యగోచరంగా తయారయిందని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement