
రైలుపేట (గుంటూరు): రాష్ట్రంలో చంద్రబాబుతో రెండుసార్లు పొత్తు పెట్టుకుని బీజేపీ తీవ్రంగా నష్టపోయిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో టీడీపీ, జనసేనకు చెందిన పలువురు మండల స్థాయి నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ 1999లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గాలి వీస్తున్న రోజుల్లో, 2014లో నరేంద్ర మోదీ గాలి వీస్తున్న సమయంలో చంద్రబాబుతో పొత్తుపెట్టుకుని రెండుసార్లు బీజేపీ దెబ్బతిందని చెప్పారు.
నాలుగున్నరేళ్లపాటు కేంద్రం నుంచి రూ. లక్షల కోట్లు నిధులు తీసుకుని, వాటిని ఇతర పనులకు కేటాయించి అవినీతికి పాల్పడిన చంద్రబాబు కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయలేదంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. దీన్ని ప్రజలు నమ్మకుండా వాస్తవాన్ని తెలుసుకున్నారు కాబట్టే నేడు అనేకమంది బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నట్లు వెల్లడించారు. అలాగే హైదరాబాద్‌లో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొరికిపోయి ఇక్కడికి పారిపోయి వచ్చారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదనే విషయం తెలిసినప్పటికీ అన్ని పార్టీలు ప్రజలను సెంటిమెంట్‌తో మభ్యపెట్టి మోసగించాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment