
ఏ నియోజకవర్గాన్ని చూసినా ఏమున్నది గర్వకారణం.. నగరం సమస్తంసమస్యల పద్మవ్యూహం. వానొస్తే చిగురుటాకులా వణుకుతున్న సిటీ. మరమ్మతులకు నోచుకోని రహదారులు.. అడుగడుగునాగుంతలు.. ఆక్రమణలకు గురైన నాలాలు.. పారిశుధ్యం కొరవడిన వీధులు.. నిధులున్నా ముందుకు సాగని అభివృద్ధి పనులు.. తాగునీటి ఇబ్బందులు.. ప్రగతికి దూరంగా మురికివాడలు... ఇలా ఒకటా రెండా మహానగరాన్ని ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. వీటన్నింటినీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలు మూడేళ్లుగా చెబుతూనే ఉన్నారు. పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో శుక్రవారం నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సభలో సిటీ ఎమ్మెల్యేలు గళం విప్పుతారని నగరవాసులు ఆశిస్తున్నారు. మీ వాణిని మీదైన బాణీలో వినిపించండి ఎమ్మెల్యే సార్లూ..!
శేరిలింగంపల్లి:ఎ.గాంధీ
♦ నియోజకవర్గంలో డ్రైనేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. రూ.200 కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు అటకెక్కాయి.
♦ చందానగర్‌లోని రెడ్డి కాలనీలో ఎస్‌టీపీ ప్లాంట్ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
♦ నాలాల విస్తరణ ఊసే లేదు. నాలాలు కబ్జాకు గురవుతుండడంతో కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ఇటీవల వర్షాలకు దీప్తిశ్రీనగర్ నీట మునిగింది. గచ్చిబౌలి నాలా పొంగడంతో ఇందిరానగర్, రాంకీటవర్స్ రోడ్డు జలదిగ్భంధంలో చిక్కుకుంది.
♦ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదు. గౌలిదొడ్డి కేశవ్‌నగర్‌లో రెండెకరాలు, తాజీనగర్‌లో 1.25 ఎకరాలు, హఫీజ్‌పేట్ సాయినగర్‌లో 1.20 ఎకరాల స్థలం గుర్తించినప్పటికీ పనులు మొదలవడం లేదు.
మలక్‌పేట్ :అహ్మద్ బలాల
♦ మలక్‌పేట్ నియోజవర్గంలోని మూసారంబాగ్, అక్బర్‌బాగ్, ఓల్డ్‌మలక్‌పేట, చావుణి డివిజన్లలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.
♦ మూసీ పరివాహక ప్రాంతాల్లోని తీగలగూడ, షాలివాహననగర్, చావుణి గుడిసెవాసులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటివరకూ పనులు ప్రారంభం కాలేదు.
♦ చాదర్‌ఘాట్, మలక్‌పేట్‌లోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యకు ఇంతవరకూ పరిష్కారం చూపలేదు.
♦ మలక్‌పేట్‌లోని ఆర్‌యూబీ కింద రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికీ మొదలు కాలేదు.
ముషీరాబాద్ :కె.లక్ష్మణ్
♦ హుస్సేన్‌సాగర్ నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం కలగానే మారింది.
♦ లోయర్ ట్యాంక్‌బండ్ గోశాల వద్ద పైప్‌లైన్ పగిలిపోయి ఏడాదిగా కలుషిత నీరు వస్తోంది.
♦ అశోక్‌నగర్ బ్రిడ్జి వెడల్పు పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి.
♦ వీఎస్టీ చౌరస్తా విస్తరణ పనులు చేపట్టాలి.
♦ ముషీరాబాద్‌లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
మహేశ్వరం :తీగల కృష్ణారెడ్డి
♦ నియోజకవర్గంలో ఇంటింటికీ కృష్ణా జలాలు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. మీర్‌పేట్, జిల్లెలగూడ, బడంగ్‌పేట్, జల్‌పల్లి మున్సిపాలిటీల పరిధిలో మూడు, నాలుగు రోజులకు ఒకసారి మంచినీరు వస్తోంది.
♦ జిల్లెలగూడ, మీర్‌పేట్‌లోని చెరువులను సుందరీకరిస్తామని ఇచ్చిన హామీ అటకెక్కింది. ఈ ప్రాంతాల్లోని చెరువులు మురుగు నీటితో కంపు కొడుతున్నాయి.
♦ రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. మరమ్మతు పనుల ఊసే లేదు.
♦ ఆర్‌కేపురం ఎన్‌టీఆర్‌నగర్ వాసులకు రెగ్యులరైజేషన్ చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు.
అంబర్‌పేట..: కిషన్‌రెడ్డి
♦ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
♦ బతుకమ్మ కుంట పునరుద్ధరణలో తీవ్ర జాప్యం.
♦ అంబర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో మౌలిక సదుపాయాల కొరత.
♦ ఆధునికీకరణకు నోచుకోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.
♦ సమస్యగా పరిణమించిన రత్నానగర్, మోహిన్‌చెరువు, ఓయూ నాలాలు.
చాంద్రాయణగుట్ట: అక్బరుద్దీన్ ఒవైసీ
♦ ఉప్పుగూడ రైల్వే క్రాసింగ్ వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో స్థానికులు, వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.
పాతబస్తీ..మారదా.. దుస్థితి
చార్మినార్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా నియోజకవర్గాల్లో మూడేళ్లుగా సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు నోచుకోవడం లేదు. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీటి కుళాయిల్లో మురుగు నీరు సరఫరా అవుతోంది. చార్మినార్ కాలిబాట పథకం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. -పాషాఖాద్రీ,చార్మినార్ ఎమ్మెల్యే
యాకుత్‌పురా: అహ్మద్‌ఖాన్
♦ సంతోష్‌నగర్ ఐ.ఎస్.సదన్ చౌరస్తా వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం హామీలకే పరిమితమైంది. మూడేళ్లు గడిచినా కార్యరూపం దాల్చలేదు.
♦ పూర్తిస్థాయిలో రీమోడలింగ్ జరగని డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందులు.
♦ నూర్‌ఖాన్‌బజార్ వద్ద నిర్మిస్తున్న మంచినీటి రిజర్వాయర్ పూర్తి కాలేదు.
బహదూర్‌పురా:మోజంఖాన్
♦ లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
♦ నాలాల విస్తరణ పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు.
♦ బహదూర్‌పురా– కిషన్‌బాగ్ రోడ్డులో నౌ నంబర్ వరకు ప్లైఓవర్ బ్రిడ్జి మూడేళ్లుగా పెండింగ్‌లోనే ఉంది.
గోషామహల్: రాజాసింగ్‌లోథా
♦ ధూల్‌పేట్‌లోని గుడుంబా తయారీదారులు రోడ్డున పడ్డారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించలేదు.
♦ బేగంబజార్‌లో చేపల మార్కెట్ అభివృద్ధి అటకెక్కింది.
♦ జుమ్మెరాత్ బజార్‌లో కల్యాణ మండపం నిర్మిస్తామన్న హామీ నెరవేరలేదు.
కుత్బుల్లాపూర్:వివేకానంద్
♦ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నాలుగేళ్లుగా పక్కా భవనం లేదు.
♦ సుభాష్‌నగర్ నుంచి ఫాక్స్‌సాగర్ వరకు నాలా పనులు మొదలు కాలేదు.
♦ జగద్గిరిగుట్టలో బస్సు డిపో ఏర్పాటు కలగానే మారింది.
♦ గాజులరామారం సర్కిల్ పరిధిలో క్వారీ గుంతలు మృత్యుకుహరాలుగా మారాయి.
♦ బహదూర్‌పల్లి, కొంపల్లి మధ్య రోడ్డు విస్తరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి.
♦ గండిమైసమ్మ జ్యోతిరావు పూలే స్టేడియం పనులు ఒక్క అడుగు కూడా పడలేదు.
♦ రసాయన వ్యర్థాలను అక్రమంగా నాలాల్లోకి వదులుతున్నా చర్యలు శూన్యం.
ఉప్పల్:ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్
♦ నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు కలగానే మిగిలింది.
♦ ఉప్పల్ ప్రధాన రహదారి విస్తరణ ప్రతిపాదనకే పరిమితం.
♦ ఏడు చెరువుల పరిరక్షణ హామీ అటకెక్కింది.
♦ ఎమ్మెల్యే నిధులు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికే పరిమితం.
♦ నాచారం ప్రధాన రహదారి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే ధర్నా చేసినా ఫలితం లేదు.
♦ పేదలకు ఇళ్ల నిర్మాణం హామీ నెరవేరలేదు.
సనత్‌నగర్:తలసాని
♦ నియోజకవర్గంలో ట్రాఫిక్ ప్రధాన సమస్య. బేగంపేట్ ప్రాంతంలో నిత్యం రద్దీ ఉంటుంది.
♦ సికింద్రాబాద్ నుంచి అమీర్‌పేట్, పంజగుట్ట, బాలానగర్, బంజారాహిల్స్, సోమాజిగూడ, సనత్‌నగర్, ఎరగ్రడ్డ, కూకట్‌పల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదొక్కటే ప్రధాన మార్గంగా ఉంది.
♦ బండమైసమ్మనగర్, జీవై కాంపౌండ్, పొట్టిశ్రీరాములునగర్, అంబేడ్కర్‌నగర్ ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలో నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ పునాదుల దశ దాటలేదు. బస్తీవాసులు అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు.
జూబ్లీహిల్స్ :మాగంటి గోపీనాథ్
♦ బోరబండలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు హామీ నెరవేరలేదు.
♦ బోరబండ పెద్దమ్మనగర్‌లో నిర్మించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. ఇంకా లబ్ధిదారులకు కేటాయించలేదు.
♦ రహమత్‌నగర్‌లో ఆర్భాటంగా ప్రకటించిన ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు.
♦ రహమత్‌నగర్‌లో ప్రభుత్వ ఐటీఐ, మ«ధురానగర్‌లో స్విమ్మింగ్‌పూల్, రాజీవ్‌నగర్‌లో ఇండోర్ స్టేడియం ఏర్పాటు కలగానే మిగిలాయి.
మేడ్చల్ :సుధీర్‌రెడ్డి
♦ ఘట్కేసర్ మండలంలో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్న ఎమ్మెల్యే హామీ నేరవేరలేదు.
♦ మేడ్చల్, ఘట్కేసర్, శామీర్‌పేట మండలాల్లో మినీ స్టేడియాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి.
కూకట్‌పల్లి :మాధవరం కృష్ణారావు
♦ భరత్‌నగర్ మార్కెట్‌ను ఆ«ధునికీకరిస్తామని చెప్పిన హామీ నెరవేరలేదు.
♦ బాలానగర్ చౌరస్తాలో నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి పనులు మొదలు కాలేదు.
మల్కాజిగిరి :చింతల కనకారెడ్డి
♦ ఆర్‌ఓబీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
♦ అల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పడకల సంఖ్య పెంచి, కొత్త భవనాన్ని నిర్మిస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి.
♦ సఫల్‌గూడ చెరువులను మినీ ట్యాంక్‌లుగా అభివృద్ధి చేసి, ఇక్కడ బోటింగ్, లైటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.
ఎల్‌బీనగర్ :ఆర్.కృష్ణయ్య
♦ వర్షాలకు కాలనీలు మునిగిపోతున్నాయి. ఇటీవల తపోవన్ కాలనీ, గ్రీన్‌పార్కు, ఆదర్శనగర్, గడ్డిఅన్నారంలోని ఇళ్లలోని వరద నీరు చేరింది.
♦ నాలాల విస్తరణ ఊసే లేదు. చెరువుల అభివృద్ధి అటకెక్కింది.
♦ రహదారుల విస్తరణ కాగితాలకే పరిమితం. శివారు ప్రాంతాలకు రోడ్లు, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment