అవినీతికి అడ్డా చంద్రబాబు ప్రభుత్వం | special story on minister adinarayana reddy statements | Sakshi
Sakshi News home page

అవినీతికి అడ్డా చంద్రబాబు ప్రభుత్వం

Published Thu, Feb 22 2018 12:58 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

special story on minister adinarayana reddy statements - Sakshi

సాక్షి, అమరావతి : 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సంక్షేమాలను గాలికి వదిలేసింది. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సింది పోయి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కన్నేసింది. ఫిరాయింపులకు పెద్ద ఎత్తున తెరతీసింది. తెలంగాణలో తెలుగుదేశం నేతలు అధికార పార్టీలో చేరితే ప్రజాస్వామ్య విరుద్దం అంటూ గొంతు చించుకున్న టీడీపీ, ఏపీలో మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో నిశ్శిగ్గుగా  ప్రవర్తించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లుగా కోట్ల రూపాయలను ఎరగా వేసి కొన్నారు. ఇందుకు ఇటీవల తాను అమ్ముడు పోయానంటూ కర్నూలు జిల్లా కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.

వస్తే కోట్లు.. లేకపోతే బెదిరింపులు:
కోట్ల రూపాయలను ఆశ చూపడం, లొంగితే కొనడం లేకపోతే బెదిరింపులకు పాల్పడటం చంద్రబాబుకు, ఆయన ప్రభుత్వానికి సర్వసాధారణం. అయితే పార్టీ మారినవారిలో కొందరికి ప్రభుత్వ ప్రాజెక్టులు ఇస్తే మరికొందరికి మంత్రి పదవుల కట్టబెట్టారు. తన మంత్రి వర్గంలో ఏకంగా నలుగురు ఫిరాయింపు మంత్రలు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిన్న మొన్నటి అధికార, ప్రతిపక్షంలో ఉండి కత్తులు దూసుకున్న వారు ఒక్కసారిగా ఓకేపార్టీలోకి రావడంతో అసంతృప్తి సెగలు చెలరేగాయి. ఒకే ఒరలో రెండు కత్తులా తయారయింది పరిస్థితి. అయితే వారిని బుజ్జగించడానికి  అధినేత నేరుగా రంగంలోకి దిగుతారు. ప్రజా సమస్యలపై ఏరోజు పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించలేని సీఎం, ఫిరాయింపు నేతల కోసం మాత్రం ఏకాంత చర్చల్లో గంటల తరబడి పాల్గొంటారు. వారిని బుజ్జగించడానికి, రాజీ పరచడానికి ప్రత్యేక ప్యాకేజీలు మాట్లాడతారు.

ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎంపీ బుట్టా రేణుక వరకూ ఆయన నడిపిన చీకటి రాజకీయం ప్రజలకు తెలిసిందే. దీనికి తోడు ఆయన చేస్తున్న ఈ అరాజకీయానికి ఎల్లో మీడియా సైతం అభివృద్ధి రంగు పులిమి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. అయినా సోషల్‌ మీడియా యాక్టివ్‌గా ఉండటంతో బాబుగారి ఆటలు సాగలేదు. అలానే అసంతృప్తితో ఉన్న తెలుగుదేశం, ఫిరాయింపు నేతలను బుజ్జగించడానికి ప్రత్యేకంగా ప్యాకేజీలను ప్రకటిస్తారు. చేసే ప్రతిపనిలో ఇద్దరు వాటాలు పంచుకోవాలంటూ సూచిస్తారు. తోడు దొంగలు ఒకటై ఊళ్లు పంచుకున్న చందాన కమీషన్లలో షేర్లు, పథకాల్లో వాటాలు పంచుకుంటారు. ప్రజల సొమ్మును తెలుగుదేశం నేతలు, మద్దతు దారులు స్వాహా చేస్తారు.

చెరో ఆఠానా:
తెలుగుశం ప్రభుత్వంలో నాయకులు వాటాలు పంచుకుంటున్నారు అనడానికి ఫిరాయింపు ఎమ్మెల్యే, మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శం. అవినీతి చేసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు చెప్పారని మంత్రి ఆది నారాయణ రెడ్డి వందల మంది ప్రజల సాక్షిగా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఆదినారాయణ రెడ్డి ఫిరాయింపుతో జమ్మలమడుగుకు చెందిన మరో టీడీపీ నేత రామసుబ్బారెడ్డి చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. అయితే వారిని బుజ్జగించడానికి గతంలో ఆర్టీసీ ఛైర్మెన్‌ పదవిని ఆశ చూపించగా రామసుబ్బారెడ్డి తిరస్కరించారు. అయితే పరిస్థితి చేయిదాటి పోకుండా ఉండేందుకు మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య రాజీ ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఎవరో చెప్పిన మాటలు కాదు మంత్రి ఆదినారాయణరెడ్డి స్వయాన తన నోటితో చెప్పిన విషయాలు.

చేసే ప్రతి అవినీతిలో టీడీపీ నేత, మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డికి కూడా అర్ధ రూపాయి భాగం ఉందని పేర్కొన్నారు. స్వయానా సీఎం చంద్రబాబు నాయుడే ఐఏఎస్ ఆఫీసర్లని తమతో పాటూ కూర్చోబెట్టి పంచాయతీ చేయించారని తెలపడం బాబు చేస్తున్న, చేసిన అరాజకీయానికి ప్రతీకలు. రామ సుబ్బారెడ్డి అడిగిన దాంట్లో మనకు సగం వస్తుంది, మనం అడిగినా రామ సుబ్బారెడ్డికి సగం వస్తుంది అంటూ ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించడం సైతం ప్రజలు ఆలోచించాల్సిన విషయం. 'వాళ్లు దాంట్లో ఏది విమర్శించినా నేనైతే పట్టించుకోను, మీరెవరూ దయ చేసి విమర్శించమాకండి. మీకు కావాల్సిన పనులు నన్ను అడగండి. ఎస్ఎంఎస్ లు పెట్టండి. నీను మీ ఎమ్మెల్యేని, పక్కకు పోయినప్పుడే మంత్రిని' అంటూ ఆది నారాయణ రెడ్డి పేర్కొనడం రాజకీయాలను అపహస్యం చేయడమే.

మంత్రిస్థానంలో ఉన్న వ్యక్తి ఇలా బహిరంగంగానే అవినీతిలో వాటాల గురించి మాట్లాడేంతగా దిగజారిపోయారంటే ముఖ్యమంత్రి ఎంతలా అవినీతిని ప్రోత్సహిస్తునారో అర్థం చేసుకోల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎల్లో మీడియా ఎన్నిరోజులు తమ్మిని బమ్మి చేసి చూపినా ఏదో ఒకరోజు ప్రజలకు వాస్తవం తెలియకుండా ఉండదు. ఎందుకంటే నిజం నిప్పులాంటిది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement