సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు సంబంధించి బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) అధికారికంగా తుది ఫలితాలను ప్రకటించింది. పరిషత్ ఎన్నికల్లో 3,548 ఎంపీటీసీ, 449 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా అధికార టీఆర్‌ఎస్ ఇతర పార్టీలపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్‌పార్టీ 1,392 ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీ సీట్లను గెలుచుకుని రెండోస్థానానికి పరిమితమైంది.
549 ఎంపీటీసీ సభ్యులు, నలుగురు జెడ్పీటీసీ సభ్యులు స్వతంత్రులుగా ఎన్నికయ్యారు. బీజేపీ 208 ఎంపీటీసీ, 8 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకోగలిగింది. సీపీఐ 38, సీపీఎం 40, టీడీపీ 21, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన, ఎస్‌ఈసీ వద్ద నమోదైన రాజకీయపార్టీలకు 20 ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. గుర్తింపు పార్టీలకు రెండు జెడ్పీటీసీ సీట్లు వచ్చాయి. బుధవారం ఈ మేరకు ఫలితాల ప్రకటన, రాజకీయపార్టీల వారీగా గెలుచుకున్న పరిషత్ స్థానాలకు చెందిన నివేదికను ఎస్‌ఈసీ విడుదల చేసింది.
ఒక్క జెడ్పీటీసీని దక్కించుకోని వామపక్షాలు
సీపీఐ,సీపీఎం టీడీపీలకు ఒక్క జెడ్పీటీసీ సీటు కూడా దక్కలేదు. మంగళవారం అర్ధరాత్రి వరకు ఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ తాజావి ప్రకటిస్తూ వచ్చారు. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటాక కూడా పూర్తి ఫలితాలపై రిటర్నింగ్ అధికారుల నుంచి నివేదికలు అందకపోవడంతో బుధవారం ఈ మేరకు అధికారిక ప్రకటనను వెలువరించారు. మొత్తం 534 మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ)ల పరిధిలోని 5,817 ఎంపీటీసీ స్థానాల్లో, 538 జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ స్థానాలకు గత నెల 6,10,14 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు ముగిశాక, మంగళవారం ఓట్ల లెక్కింపు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే శుక్రవారం పరోక్ష పద్ధతుల్లో ఎన్నికైన∙ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను, శనివారం జెడ్పీటీసీ సభ్యులు జెడ్పీపీ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు. దీంతో రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ప్రస్తుతం జెడ్పీపీ, ఎంపీపీ పదవులకు ఎన్నికైన వారు పాత పాలకమండళ్ల పదవీకాలం ముగిశాక జూలై మొదటివారంలో అధికారికంగా పదవీ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment