మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం | State interests are important to us says Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

Published Sat, Dec 15 2018 4:21 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

State interests are important to us says Botsa Satyanarayana - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న బొత్స. చిత్రంలో బాలశౌరి, అనంత వెంకట్రామిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ఈ విషయంలో ఎవరితోనూ రాజీపడబోమని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏపీలో కేసీఆర్‌ను ప్రచారానికి రమ్మని తామే పిలుస్తున్నట్టు టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని తప్పుపట్టారు. బీజేపీతో కుమ్మక్కయ్యామని, ఎంఐఎంని స్వాగతిస్తున్నామంటూ సీఎం, మంత్రులు తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా, రాజకీయ ప్రయోజనాలకే టీడీపీ ప్రాధాన్యమిస్తోందన్నారు. టీడీపీ మాయమాటలు, తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మొద్దన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావాన్ని, అభివృద్ధిలో పోటీనే తమ పార్టీ ఆకాంక్షిస్తోందన్నారు. అభివృద్ధిని సాధించే విషయంలో పోటీ ఉండాలేతప్ప మనస్పర్ధలుండరాదనేది వైఎస్సార్‌సీపీ విధానమన్నారు. రెండు పడవలపై తామెప్పుడు ప్రయాణించమని, అందుకే తెలంగాణలో పోటీ చేయలేదని వివరించారు.

టీడీపీ వల్లే బీజేపీ ఓడిందనడం హాస్యాస్పదం..
టీడీపీ ప్రచారం కారణంగా మూడు రాష్ట్రాల్లో బీజేపీ చిత్తుగా ఓడిందని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని, కనీసం ఆ రాష్ట్రాల్లో ఆయన ప్రచారం కూడా చేయలేదని బొత్స అన్నారు. చంద్రబాబు మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. తెలంగాణ ఫలితాలు వెలువడిన వెంటనే శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ట్విట్టరులో పోస్టు చేశారని, ఆ వెంటనే చంద్రబాబు ట్వీట్‌ చేశారని, సాయంత్రం ఆరింటికి మాత్రమే తమ నేత వైఎస్‌ జగన్‌ విజయం సాధించిన నేతల్ని అభినందించారని తెలిపారు. దీన్నిబట్టి ఎవరికి సన్నిహిత సంబంధాలున్నాయో తెలుస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌తో కలసి పనిచేసేందుకు తానే ముందుగా మాట్లాడినట్టు చంద్రబాబు చెప్పుకున్నారని గుర్తుచేశారు. ఆయనకు నీతి నియమాలుండవని, ఇలాంటి వ్యక్తి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. సర్వే పేరుతో లగడపాటి డ్రామాలను బొత్స తప్పుపట్టారు. ఆర్థికంగా నష్టపోయిన లగడపాటి దాన్నుంచి గట్టెక్కేందుకు చంద్రబాబుతో కలసి కుట్ర చేశారన్నారు. లగడపాటి సర్వేవల్ల బెట్టింగుల్లో చాలామంది నష్టపోయారని తెలిపారు.

తన నీడను చూసుకుని తానే భయపడుతున్నారు..
ఏపీలో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ తానుగా ప్రకటించారని, అందులో తమ ప్రమేయమేమీ లేదని బొత్స చెప్పారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డితో అసదుద్దీన్‌ సన్నిహితంగా ఉన్నారని, జగన్‌తోనూ అంతే సన్నిహితంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు మోసాన్ని ప్రజలకు తెలపాలనే అసదుద్దీన్‌ ప్రచారం చేస్తానని ప్రకటించారని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి ఘటనకు సంబంధించి నారా లోకేశ్, డీజీపీ, చంద్రబాబు కుట్రలు క్రమంగా బయటకొస్తున్నాయని, చంద్రబాబు తన నీడను చూసుకుని తానే భయపడుతున్నాడని అన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీలు బాలశౌరి, అనంతవెంకట్రామిరెడ్డి కూడా పాల్గొన్నారు. 

కేసీఆర్‌కు వత్తాసు పలికిందెవరు?
సీఎం చంద్రబాబు తగరపువలస, ఒంగోలులో చేసిన వ్యాఖ్యలను బొత్స తప్పుపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తున్నదంటున్న చంద్రబాబు ఇంతకుముందు బావమరిది హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకునే కేటీఆర్‌తో పొత్తు అంశాన్ని చర్చించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. చంద్రబాబు, కేసీఆర్‌ల సాన్నిహిత్యాన్ని ఉదహరిస్తూ.. తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్‌ విజయవాడ కనకదుర్గ దేవాలయానికి రాగా ఏపీ మంత్రులు ఘనస్వాగతం పలికారని, ప్రొటోకాల్‌ కోసం వెళ్లామని సమర్థించుకున్నారని గుర్తు చేశారు. అలాగే కేసీఆర్‌ 2017లో చేసిన చండీయాగానికి చంద్రబాబు హాజరవడాన్నీ, మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి కేసీఆర్‌ హాజరైనప్పుడు.. చంద్రబాబు, కేసీఆర్, పరిటాల రవి చిత్రపటాలతో అనంతపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్నీ ప్రస్తావించారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, టీడీపీ కలిసి పోటీ చేయాలన్న భావనతో చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను దెబ్బతీశారని, ఆయన వైఖరివల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని దుయ్యబట్టారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అయినా టీడీపీ మంత్రులు, సీఎం పనిగట్టుకుని తమ పార్టీ వాళ్లతో, వీళ్లతో కలుస్తోందని ప్రచారం చేయడం అనైతికమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవాళ్లకు, రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చేవాళ్లకే మద్దతిస్తామని తమ పార్టీ ఎప్పుడో ప్రకటించిందని బొత్స గుర్తుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement