టీఆర్‌ఎస్ ఎంపీ కవిత
ఢిల్లీ : రైతులకు రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినా మళ్లీ అప్పులు పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఈ కష్టాల నుంచి రైతులను గట్టెక్కించేందుకే రైతుబంధు పథకం తెచ్చామని నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు రైతు బంధు పథకం ఉపయోగపడుతుందని అన్నారు. దక్షిణ, ఉత్తర భారత రాష్ట్రాలు అనే భేదాలు వద్దని, మనమందరం భారతీయులమని అన్నారు.
ఫలితాలిచ్చే రాష్ట్రాలను, ఫలితాలు చూపని రాష్ట్రాలను ఒక గాటన కట్టొద్దని కోరారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ బలమైన పార్టీ అని అన్నారు. అందుకే బీజేపీ ఏజెంట్, కాంగ్రెస్ ఏజెంట్ అని ఇతర పార్టీలు దుష్ర్పచారం చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాల మార్పిడి కాదు, వ్యవస్థలో మార్పు కావాలని పేర్కొన్నారు. ‘ఫెడరల్ ఫ్రంట్ గేమ్ చేంజర్’ అని వ్యాఖ్యానించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పక్రియ కొనసాగుతుందని, తమ జెండా నచ్చి వచ్చే వారందరికీ స్వాగతం చెబుతామని తెలిపారు.
బీజేపీకి తాము సన్నిహితంగా లేమని, మోదీ ప్రభుత్వంతో వర్కింగ్ రిలేషన్స్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. దేశాన్ని మార్చే అవకాశాన్ని మోదీ జారవిడుచుకున్నారని, ఈ ఏడాదిలోనైనా రైతులకు మేలు చేస్తారేమో చూడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలను పరిగణలోనికి తీసుకోకుండా పాలసీలు రూపొందించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment