మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి
ఎర్రగుంట్ల : ‘మంత్రి ఆదినారాయణరెడ్డి ఊళ్లకు నేను ఒంటరిగా వస్తాను.. ఇంటింటికి తిప్పమను, అదే మంత్రి ఆదినారాయణరెడ్డిని మా పల్లెలకు రమ్మనండి.. నేను ఒక్కడిని తిప్పుతాను.. మంత్రి మంచి చేయలేదనే ఆ పల్లెలకు చెందిన వాళ్లు మమ్మల్ని మంచితనంతో పిలిచారు. రాజకీయంగా 15 ఏళ్ల నుంచి ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్నావే... ఆ పల్లెల్లోని యువతకు ఉద్యోగాలు ఇచ్చావా.. నీవు మంచి చేయకపోతేనే వారు మమ్మల్ని పిలుస్తున్నారు’.. అని వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన నిడుజివ్వి గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. మా నిడుజివ్వి గ్రామంలో నీటి సమస్యలేదు. మంత్రి మా గ్రామానికి ట్యాంక్ కట్టించానని చెబుతున్నారు.
ప్రపంచ బ్యాంక్ నిధులతో కట్టారు. మా ఊరిలో గత 50 ఏళ్ల నుంచి నీటి సమస్యలేదు. మా కుటుంబం స్వాతంత్య్రం కాలం నుంచి రాజకీయంలో ఉంది. మా తాత రామిరెడ్డి అప్పట్లోనే ఎంపీగా పోటీ చేశారు. తర్వాత పెద్దనాన్న మైసురారెడి,్డ ఆ తర్వాత మేం రాజకీయంలోకి వచ్చాం. మాకంటూ ఒక రాజకీయ చరిత్ర ఉంది. నన్ను కొత్త బిచ్చగాడు అని సంబోధిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శివారెడ్డి హత్య జరిగిన తర్వాత వీరందరు వచ్చి మా ఇంటి వద్ద కాపలాగా కూర్చునేవారు. ఇలాంటి పరిస్థితి వారిది. నేను వైద్యుడిగా సేవ చేసి గుర్తింపు పొందాను. ఆదినారాయణరెడ్డికి ఏం గుర్తింపు ఉంది. మీ నాన్న ఫ్యాక్షన్‌లో చనిపోయిన తర్వాత వైఎస్‌ఆర్ భిక్ష పెట్టాడు. తర్వాత మీ నారాయణరెడ్డి మా ఇళ్ల చుట్టు తిరిగాడు. 2004 వరకు రాజకీయాల్లో లేవు. ఎక్కడో బడి పంతులుగా ఉన్నావు. లేదా క్లబ్‌ల్లో పేకాట ఆడుతు ఉండేవాడివి. 2004లో వైఎస్సార్ పుణ్యంతో మీ అన్నను బెదిరించి టిక్కెట్ తెచ్చుకున్నావు అని పేర్కొన్నారు.
నాకు నిధుల గురించి తెలియదు అంటున్నావు. నీవు మామూళ్ల కోసమే నిధులు తెచ్చుకున్నావు. మా పెద్దనాన్న నిధులు తెచ్చి అభివృద్ధి పనులు ఎన్నో చేశారు. నీకేం ఘనత ఉంది. 1996 ఎన్నికలలో మా ఊర్లో రిగ్గింగ్ జరిపినారు అని చెబుతున్నావే.. ఆ రోజు వైఎస్సార్ కోసమే ప్రజలు ఓట్లు వేశారు. ఆ రోజు స్వయాన అల్లుడైన రాజమోహన్‌రెడ్డికి కాకుండా వైఎస్సార్ కు మద్దతు తెలిపిన ఘనత పేర్ల శివారెడ్డికి దక్కిందన్నారు. మీరేం చేశారు అని ప్రశ్నించారు. 1990లో మీ అన్న నారాయణరెడ్డికి మా పెద్దనాన్న మైసురారెడ్డి డీసీసీ చైర్మన్ పదవి ఇప్పించారని, దీనిని గుర్తుంచుకోవాలన్నారు. నీ ట్రస్టు ద్వారా రూ.2500 కట్టించుకొని కుట్టుమిషన్లు ఇచ్చావు. ఆ రోజు తెల్లరేషన్ కార్డులు కల్గిన వారికి రూ.1200లకే ఇస్తున్నారు. నీవేమైనా ఉచితంగా ఇచ్చావా అని నిలదీశారు.
రిజర్వాయర్ల ఏర్పాటు.. పాదయాత్ర చేసిన ఘనత వైఎస్సార్, మైసూరారెడ్డిలదే..
రిజర్వాయర్లు కట్టించామని చెబుతున్నావు. ఆరోజు గండికోట, వామికొండ రిజర్వాయర్ల కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి, మా పెద్దనాన్న మైసూరారెడ్డిలు పాద యాత్ర చేశారు. నీవేం చేశావు. వైఎస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమీషన్లు మేసినావు. నేను ఊర్ల పేర్లు చెప్పలేనని అంటున్నావు. నేను నీ పల్లెలకు వస్తాను, నీవు నా పల్లెలకు రా తిప్పుతాను అన్నారు.
ఎర్రగుంట్ల అభివృద్ధి వైఎస్సార్ హయాంలోనే జరిగింది
ఎర్రగుంట్లలో ఏమి చేశావు..? ఎర్రగుంట్లకు ఓవర్ బ్రిడ్జి, కళాశాలలు ఎప్పుడు వచ్చింది తెలుసు. 2008కు ముందు ఆదినారాయణరెడ్డి ఎవరో తెలియదు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇంటర్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలు వచ్చాయి. ఎర్రగుంట్లను ఎవరు మున్సిపాలిటీ చేయమని అడిగారు. దీనిపై నాలుగు రోడ్ల కూడలిలో ఓటింగ్ పెడదాం.. చర్చకు రండి మేం సిద్ధం. అతని లాభం కోసం, వ్యాపార వేత్తలకోసం మున్సిపాల్టీ చేశారు. పన్నులు పెరిగాయి అని తెలిపారు. పెద్దదండ్లూరు గ్రామంలో మంత్రి భార్య.. ఆయన కుమారుడు ఘర్షణలకు ఆజ్యం పోశారన్నారు. 2014లో ఎర్రగుంట్ల మండల ప్రజలు వేసిన ఓట్లతోనే ఆ ఎన్నికల్లో బయటపడ్డావన్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి మైసురారెడ్డి తనయుడు హర్షవర్దన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు సురేంద్రనాథ్‌రెడ్డి, కౌన్సిలర్ డి. సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరామకృష్ణారెడ్డి, పట్టణ, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షర్పుద్దీన్, మహబూబ్ వలి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, పట్టణ, మండల యూత్ ప్రెసిడెంట్లు దివాకర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిలు, స్థానిక నాయకులు మల్లు నాగార్జునరెడ్డి, వర్రా డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment