రజనీకాంత్ (ఫైల్ ఫొటో)
సాక్షి, చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్‌హాసన్‌లు రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించిన తర్వాత తమిళనాడులో ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. వీరిద్దరూ రాజకీయంగా కలిసి పనిచేస్తారా.. ఒకే పార్శ్వంలోనే ముందడుగు వేస్తారా అనే దానిపై రాష్ట్ర ప్రజలతో పాటు రాజకీయ నాయకులకు ఎన్నో అనుమానాలున్నాయి. దీనిపై రజనీకాంత్ మాట్లాడుతూ.. 'రాజకీయంగా కలిసి ముందుకెళ్లే విషయం కమల్‌హాసనే నిర్ణయించాలి. రానున్న లోక్‌సభ ఎన్నికలపై త్వరలోనే నా నిర్ణయాన్ని వెల్లడిస్తా. దేశంలో రాజకీయంగానూ, ప్రభుత్వ వ్యవస్థల పరంగానూ అత్యంత దారుణంగా ఉన్న రాష్ట్రం తమిళనాడేనని' అభిప్రాయపడ్డారు. రోబో 2.ఓ గ్రాఫిక్ వర్క్స్ ఆలస్యం అవుతున్నందున ముందుగా ఏ సినిమా విడుదల చేయాలో రెండు రోజుల్లో చెబుతానని రజనీ అన్నారు. పా.రంజత్ తెరక్కిస్తున్న కాలా మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
లోకనాయకుడు కమల్‌హాసన్ మాత్రం రజనీతో కలిసి పనిచేస్తారా లేదా అన్నదానిపై ఏ మాత్రం సమాచారం ఇవ్వడం లేదు. రజనీకాంత్‌తో కలిసి నడుస్తానా లేదా అన్నదానిపై కాలమే సమాధానం ఇస్తుందన్నారు. మా ఇద్దరి సిద్ధాంతాలు రాజకీయాల్లో సెట్ అవుతాయా అనేది మరోసారి ఆలోచించాలన్నారు. వీరిద్దరూ కలిసి అడుగేస్తే మీ వెంటే అంటూ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇదివరకే తమ అభిప్రాయాలను వెల్లడించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment