న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 50 శాతం ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్(వీవీప్యాట్) స్లిప్పులను లెక్కించాలన్న విపక్షాల పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో లోక్‌సభ స్థానంలోని ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఏవైనా 5 వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వసనీయత ఏర్పడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. 50 శాతం వీవీప్యాట్ యంత్రాలను ఈవీఎంలతో సరిపోల్చాలని 21 విపక్ష పార్టీలు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.
ఎక్కువ సిబ్బంది కావాలి
సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతమున్న నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా 4,125 వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ఈవీఎంల ద్వారా సరిపోల్చుతున్నాం. ఒకవేళ ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో లెక్కించాల్సిన వీవీప్యాట్ యంత్రాల సంఖ్యను పెంచితే, ఎన్నికల సిబ్బంది స్వయంగా లెక్కించాల్సి ఉంటుంది. దీనివల్ల తప్పులు జరిగే అవకాశముంది. ప్రస్తుతం వీవీప్యాట్ లెక్కింపునకు ముగ్గురు ఎన్నికల సిబ్బంది, ఓ పరిశీలకుడితో పాటు రిటర్నింగ్ అధికారిని నియమిస్తున్నాం.
కానీ వీవీప్యాట్ల సంఖ్య పెరిగితే, భారీగా సిబ్బందిని విధుల్లోకి తీసుకోవడంతో పాటు వారికి విశేషమైన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది’ అని తెలిపారు. మరోవైపు విపక్షాల తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ స్పందిస్తూ.. 50 శాతం వీవీప్యాట్ యంత్రాల స్లిప్పులను, ఈవీఎంలతో సరిపోల్చేందుకు అదనంగా 5.2 రోజుల సమయం అవసరమని ఈసీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకవేళ సిబ్బందిని పెంచితే ఫలితాల వెల్లడి ఆలస్యం కాదన్నారు. ఒకవేళ ఈసీ 50 శాతం వీవీప్యాట్లను లెక్కిస్తే ఆరు రోజులు ఆలస్యమైనా తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు.
ర్యాండమ్ యథాతథం
దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం..‘వీవీప్యాట్–ఈవీఎంల లెక్కింపునకు ప్రస్తుతం అనుసరిస్తున్న ర్యాండమ్ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుంది’ అని స్పష్టం చేసింది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ, సుప్రీంకోర్టు తీర్పును పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటామని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 20,600 పోలింగ్ స్టేషన్లలలో వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చనున్నారు. ఈ విషయమై ఈసీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. వీవీప్యాట్ల లెక్కింపునకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో రిజర్వులో ఉంచినవాటితో కలిపి 39.6 లక్షల ఈవీఎంలు, 17.4 లక్షల వీవీప్యాట్లు వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment