రేణుకా చౌదరి (పాత చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నంత పని చేసేశారు. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ‘శూర్పణక’ పోస్టుకు ఆమె నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రాజ్యసభలో ఆమె హక్కుల తీర్మానం కూడా ప్రవేశపెట్టారు.
పార్లమెంటులో ప్రధాని మోదీ.. రేణుకా చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, తదనంతర కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిరెన్ రిజిజు వివాదాస్పద పోస్టు ఫేస్‌బుక్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. రామాయణం సీరియల్‌లోని శూర్పణక పాత్ర నవ్వుతున్న వీడియోకి.. మోదీ మాట్లాడిన సమయంలో రేణుకా చౌదరి నవ్వుతున్న దృశ్యాలను ఆయన జత చేశారు. దీనిపై రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యసభలో తన నవ్వుపై మోదీ వ్యాఖ్యలను జతచేస్తూ.. రిజిజు వీడియో పోస్టుపై హక్కుల తీర్మానం ఆమె ప్రవేశపెట్టారు. ‘‘ఇది ఓ మహిళను అవమానించడమే కాదు, తీవ్ర అభ్యంతరకరం కూడా... దీనిపై నేను హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాను..’’ అని రేణుకా చౌదరి పేర్కొన్నారు.
కాగా.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రేణుక నవ్వడంపై ప్రధాని మాట్లాడుతూ.... ‘‘రామాయణం సీరియల్ తర్వాత ఇంత నవ్వు వినే భాగ్యం నాకు దక్కింది..’’ అన్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇక తాను ఎందుకలా నవ్వాల్సి వచ్చిందో ఆమె కూడా వివరణ ఇచ్చుకున్నారు. ‘గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధార్ కార్డు అవసరం లేదని పెద్ద ప్రసంగమే చేశారు. అలాంటాయన ఆధార్‌ను పుట్టించిందే తామేనని చెప్తే నవ్వు రాకుండా వుంటుందా’ అంటూ రేణుకా చౌదరి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment