సాక్షి, న్యూఢిల్లీ : మణిపూర్ రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మనుగడపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించలేక పోయినప్పటికీ మిత్రపక్షాలను కూడగట్టుకోవడంతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడేళ్లపాటు ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చింది. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో జూన్ 17వ తేదీ నుంచి చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు బీజేపీ ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేసింది. బీజేపీ సంకీర్ణ భాగస్వామిక పక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎల్. జయంత్‌కుమార్ సింగ్ సహా ఆ పార్టీకి చెందిన నలుగురు మంత్రులు జూన్ 17వ తేదీన తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత వెంటనే ఆ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటునట్లు ప్రకటించింది. అదే రోజు బీజేపీకి చెందిన ముగ్గురు శాసన సభ్యులు తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం బీజేపీ ప్రభుత్వం పరిస్థితిని మరింత దిగజార్చింది. మరో స్వతంత్య్ర సభ్యుడు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కూడా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించి కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామని చెప్పడం ప్రభుత్వ పరిస్థితిని దిగజార్చింది. (పతనం అంచున బీజేపీ సర్కార్)
ఇదే అదనుగా జూన్ 18వ తేదీన ఎన్ బీరెన్ సింగ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ నోటీసు జారీ చేసింది. సభ్యుల మద్దతు లేదా రాజీనామాలనే పరిగణలోకి తీసుకుంటే మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం పడి పోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి అతి సులువుగా రావాలి. కానీ ఈ పరిణామాల్లో పార్టీ ఫిరాయింపులు, ససెన్షన్లు ఉండడంతో పరిస్థితి కాస్త జఠిలం అయింది. 60 సీట్లుగల మణిపూర్ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లు రాగా, బీజేపీకి 21 సీట్లు వచ్చాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ తమకు మద్దతు ఇస్తోందంటూ వివాదాస్పద లేఖలు చూపించి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ తర్వాత నేషనల్ పీపుల్స్ పార్టీ నలుగురు సభ్యులతోపాటు నాగా పీపుల్స్ ఫ్రంట్ నలుగురు సభ్యుల మద్దతును, లోక్‌జన శక్తి పార్టీ ఏకైక సభ్యుడి మద్దతో బీజీపీ తన బలాన్ని 30 సీట్లకు పెంచుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన ఒక్క సీటును టీ. శ్యామ్ కుమార్ సింగ్ అనే కాంగ్రెస్ సభ్యుడి ఫిరాయింపుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కోర్టులను ఆశ్రయించడంతో బీజేపీకి మద్దతు పలికిన శ్యామ్ కుమార్ సింగ్ అసెంబ్లీ సభ్యత్వం చెల్లదంటూ సుప్రీం కోర్టు గత మార్చి నెలలో తీర్పు చెప్పింది. దాంతో మణిపూర్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 59కి చేరుకుంది. ఇదిలావుండగా, 2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ఆ పార్టీలోకి ఫిరాయించిన ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలంటూ మణిపూర్ హైకోర్టు ఈనెల మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే వారి సస్పెన్షన్‌పై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం పెండింగ్‌లో ఉండడంతో జూన్ 19వ తేదీ వరకు వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోరాదంటూ కోర్టు ఆంక్షలు విధించింది. ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌పై వాదాపవాదాలు వింటోన్న స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వివాద అంశాన్ని జూన్ 22కు వాయిదా వేశారు. వారని తక్షణం సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
సాధ్యాసాధ్యాలు
ఇన్ని మలుపులు కలిగిన ఈ వ్యవహరంలో ఏం జరిగే అవకాశం ఉందో ఒక్కసారి పరిశీలించాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఏడుగురు కాంగ్రెస్ తిరుగుబాటు సభ్యుల్లో నలుగరు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరగా ముగ్గురు బీజేపీతోనే ఉండిపోయారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని అసెంబ్లీ స్పీకర్ బీజేపీతో ఉన్న ముగ్గురిని మాత్రమే సస్పెండ్ చేస్తే అప్పుడు అసెంబ్లీ సభ్యుల సంఖ్య 59 నుంచి 56కు పడిపోతుంది. కాంగ్రెస్ సభ్యుల మద్దతు సంఖ్య 30కు చేరుకుంటుంది. అలాకాకుండా స్పీకర్ మొత్తం ఏడుగురు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తే అసెంబ్లీ సభ్యుల సంఖ్య49కి పడిపోతుంది. అప్పటికీ 26 మంది సభ్యుల బలంతో కాంగ్రెస్ పార్టీ సులువుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. తీర్పు ఇంత ఏకపక్షంగా కనిపిస్తున్నప్పటì కీ కాంగ్రెస్ పక్షాల్లో ఇంకా భయం పోలేదు. 2017లో 28 సీట్లు వచ్చిన కాంగ్రెస్‌ను కాదని 21 సీట్లు సాధించిన బీజేపీ అధికారం చేజిక్కించుకోగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకిప్పుడు అలాంటిది సాధ్యం కాదా! అన్నది వారి అనుమానం, భయం.
Comments
Please login to add a commentAdd a comment