
టీజీ వెంకటేష్, ఎస్వీ మోహన్ రెడ్డి
సాక్షి, కర్నూలు : మంత్రి నారా లోకేష్‌ను హిప్నటైజ్ చేశారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై కర్నూలు ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కౌంటరిచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిందే లోకేష్ ప్రకటించారన్నారు. రాజకీయాల్లో లోకేష్ ఓ కొత్త పంథాను అనుసరిస్తున్నారని, టీడీపీ జాతీయ కార్యదర్శి హోదాలోనే ఆయన కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారని స్పష్టం చేశారు.
ఎమ్మిగనూరులో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డేనని లోకేష్ ప్రకటించినట్లు ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముందస్తు అభ్యర్థుల ప్రకటన వల్ల గెలుపు అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. గతంలో టీజీ వెంకటేష్‌కు ఎంపీ పదవి, తనకు ఎమ్మెల్యే స్థానం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని, ఈ విషయంలో తాను ఎవరిని హిప్నటైజ్ చేయలేదన్నారు. ఆ అవసరం కూడా తనకు లేదని, పార్టీ గెలుపు కోసం అందరితో కలిసి పనిచేస్తానని చెప్పారు.
కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ 2019 ఎన్నికలకు ముందస్తుగానే కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ స్థానాల నుంచి టికెట్లు ఆశించిన టీజీ వెంకటేశ్, లోకేష్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటుందని.. మంత్రి నిర్ణయం కూడా ఇలాంటిదేనని ఎద్దేవా చేశారు. ఎస్వీ మోహన్ రెడ్డి ఏమైనా చేయగలరని.. అదే విధంగా లోకేష్‌ను ఎమైనా హిప్నటైజ్ చేశారేమో అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment