స్వామి పరిపూర్ణానంద
సాక్షి, హైదరాబాద్ : తన నగర బహిష్కరణ.. అమిత్ షా చేత తన రాజకీయ ఆవిష్కరణైందని బీజేపీ నేత, స్వామి పరిపూర్ణానంద తెలిపారు. బుధవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయనను పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతించాయి. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా.. దళిత వాడలు, నిరాదరణకు గురైన బస్తీల్లో తిరిగానని, అక్కడి పరిస్థితులు చూసి తీవ్రంగా చలించానన్నారు. తాను రాజకీయాల్లో ఇమడగలనా లేదా అని ఆలోచించానని, తనకు దేవుడు తప్ప ఇంకెవరు లేరని తెలిపారు. రాజకీయాల్లో ఫాదర్, లేదా గాడ్ ఫాదర్ అయినా ఉండాలని, ఈ విషయంలో తన తల్లిదండ్రులు, గురువుల రాజకీయాల్లోకి రావాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు రాకపోతే.. ఇంకెప్పుడు అడుగు పెట్టొద్దని, ఏది ఆశించవద్దని ఆ ముగ్గరు చెప్పారని స్పష్టం చేశారు.
ఇంకా స్వామిజీ ఎమన్నారంటే.. ‘ఈ నెల8న అమిత్‌షాను కలిసినప్పుడు.. నా మీద చూపిన గౌరవం, వారితో మాట్లాడాకా నా ధైర్యం మరింత రెట్టింపు అయ్యింది. మీ సేవ ఈ దేశానికి అవసరమని అమిత్ షా తెలిపారు. నవరాత్రులు అయ్యాక నిర్ణయం చెబుతానన్నాను. స్వామిజీ తెలంగాణకు వెళ్లండి.. లక్ష్మణ్‌ను కలిసాక పార్టీ మీకు సూచన చేస్తుందని అన్నారు. రాజకీయం కాదు రాజనీతి ఉండాలని అనుకుంటున్నాను. దేశాన్ని రక్షించుకోవాలి, ధర్మాన్ని పరి రక్షించుకోవాలి అంటే బీజేపీ రావాలనుకున్నాను.
బీజేపీలో కులాలు, కుటుంబాలు లేవు అవినీతి లేదు. గుణమే హద్దు. తెలంగాణలో జనతా సర్కార్ రావాలి.. పరివార సర్కార్ పోవాలి.. అదే మా నినాదం. మిషన్70లో తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తోంది. అమిత్ షా బాధ్యత తీసుకోమన్నారు. ఏ పదవి, బాధ్యత వద్దని తెలిపాను.పని చేయడానికి వచ్చాను. పదవి కోసం కాదు. లక్ష్మణ్ ఏ గీత గీసిన పాటిస్తాను. ఆశ లేదు ఆశయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వాలు.. దారుసలాంతో నడిచాయి. ఇప్పుడు వచ్చే బీజేపీ సర్కార్ లాల్ దర్వాజ ఆజ్ఞలతో నడుస్తది. అమావాస్య నాకు మంచి ముహూర్తం. ఎన్నికల కమిషన్ కూడా మాకు మంచి రోజునే కేటాయించింది. తెలంగాణ.. కాషాయ తెలంగాణగా మారబోతోంది.’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment