సాక్షి, న్యూఢిల్లీ: శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద శుక్రవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా పార్టీ కండువాతో ఆయనను సాదరంగా ఆహ్వానించారు. పరిపూర్ణానందను అమిత్ షా వద్దకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తోడ్కోని వచ్చారు. బీజేపీలో చేరడం పట్ల పరిపూర్ణానంద హర్షం వ్యక్తం చేశారు. బీజేపీని బలోపేతం చేసేందుకు సర్వశక్తులు ధారపోస్తానని ఈ సందర్భంగా అన్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, రాంమాధవ్ మార్గదర్శనంలో పని చేస్తానని చెప్పారు. రోజుకు 17 గంటలు పార్టీ కోసమే పాటు పడతానని, దేశంలో ఎక్కడైనా పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
లక్ష్మణ్‌కు అమిత్ షా ఫోన్
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై కసరత్తు కొనసాగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఫోన్ చేశారు. రేపు ఢిల్లీలో 11 గంటలకు జరగబోయే సమావేశానికి రావాలని లక్ష్మణ్‌ను పిలిచారు. రేపటి పార్లమెంట్ బోర్డ్ మీటింగ్‌లో 30 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేయనుంది బీజేపీ అధిష్టానం. దీంతో అధ్యక్షుడు లక్ష్మణ్, ఇంచార్జ్ కృష్ణదాస్, మురళీధర్ రావు, కిషన్ రెడ్డి ఈ రాత్రికి ఢిల్లీకి బయలుదేరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment