సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మూడపాడులో నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రూ.5000 కోట్లతో యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, ఏపీలో కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి యాదవులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఆయన ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ దుర్గగుడి వరకు భారీ ర్యాలీగా బయలుదేరి దుర్గమాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రచారానికి పరిమితమైన నాయకుడని విమర్శించారు. ప్రజల సొమ్ముతో ప్రచారాలు చేసుకున్నంత మాత్రాన వాస్తవాలను దాచలేమన్నారు. టీఆర్‌ఎస్ కాదు, ఏపీ ప్రజలే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. (ఏపీ సీఎంపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్)
ఏపీలో కుల రాజకీయాలకు కారణం చంద్రబాబేనని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ప్రభ్వుతం ఉన్న వాళ్లు భిన్న రకాలుగా మాట్లాడారని విమర్శించారు. హోదాకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment