సాక్షి ప్రతినిధి, కడప: రాజ్యంగ బద్ధంగా నడుచుకుంటానని, రాగద్వేషాలకతీతంగా వ్యవహరిస్తానని ప్రజా శ్రేయస్సుకు పాటుపడతాని ప్రమాణం చేసిన మంత్రివర్యులు రాజ్యంగ విలువకు తిలోదకాలిస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతర్ చేస్తున్నారు. అధికారులు తప్పు తెలుసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టినా, మొండిగా మంకుపట్టులో ఉన్న టీడీపీ నేతలకు మంత్రివర్యులు అండగా నిలుస్తున్నారు. నైతిక విలువలకు కోల్పోయిన ఆయన మరోమారు తన సహాజ ధోరణిని ప్రదర్శించిన వైనమిది. ప్రొద్దుటూరు మున్సిఫల్ గాంధీఫార్కులో వాటర్ ట్యాంకు నిర్మాణం పట్ల స్థానికులు ఆక్షేపణలు తెలిపారు. వారి అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అభ్యంతరం చెప్పారు. మరో 50 మీటర్లు దూరంలో మూతపడిన పాఠశాలలో నిర్మిస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదని, అక్కడ చేపట్టాలని సూచించారు. దాదాపు 2లక్షల జనాభాకు ఉన్న ఒకే ఒక్క పార్కులో వాటర్ ట్యాంకు ఏర్పాటు చేసి, పాదచారులకు ఆటంకం లేకుండా చూడాలని ప్రజాహితం దృష్ట్యా అభ్యర్థించారు.
మరోవైపు పార్కులు, పబ్లిక్‌కు యోగ్యతరమైన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు సైతం స్పష్టం చేస్తున్నాయి. ఇంకోవైపు జిల్లా జడ్జి జి శ్రీనివాస్ జోక్యం అనివార్యమైంది. ప్రజాహితం మేరకు పార్కులో ట్యాంకు నిర్మించరాదని హితవు పలికారు. ఇవన్నీ లెక్కపెట్టకుండా మార్కెటింగ్, పశుసంవర్ధకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ఎవ్వరూ ఎలాంటి ఆటంకాలు సృష్టించినా పార్కులో ట్యాంకు నిర్మిస్తామని ప్రకటించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది. మంత్రిగా ఉండి సామాన్యులు మాట్లాడినట్లుగా వ్యవహరించడాన్ని పలువురు తప్పు బడుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, జిల్లా జడ్జి జోక్యం కారణంగా పబ్లిక్‌హెల్త్, మున్సిఫల్ కమిషనర్ కాంట్రాక్టరు మరోచోట ట్యాంకు నిర్మిస్తామని రాతపూర్వకంగా విన్నవించినా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాత్రమే పార్కులో ట్యాంకు నిర్మిస్తామని మొండిగా వ్యవహరిస్తున్నారు. అందుకు వత్తాసుగా మంత్రి ఆదినారాయణరెడ్డి నిలుస్తుండడం విశేషం.
వివాదస్పద స్థలంలోనే ఎందుకు...?
ప్రొద్దుటూరు పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.138కోట్లుతో మైలవరం జలాశయం నుంచి పైపులైను ఏర్పాటు, 3ట్యాంకులు నిర్మించనున్నారు. 2ట్యాంకులు నిర్మాణంలో ఎలాంటి అభ్యంతరం లేదు. పార్కులో నిర్మించే వాటర్ ట్యాంకు పట్ల మాత్రమే ప్రజలు, ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవికతను అర్థం చేసుకోకుండా ప్రజాహితం కోసమే పాలకులు ఉన్నారన్న సంకేతాలు ఇవ్వకుండా టీడీపీ నేత నిర్మించాలన్నారు, కాబట్టి అక్కడే నిర్మిస్తామని ప్రకటించడం ఏమేరకు సబబోనని పలువురు నిలదీస్తున్నారు. వివాదస్పదస్థలంలోనే ట్యాంకు నిర్మిస్తామని మంత్రి ఆది ప్రకటించడంపై ప్రజాస్వామ్యవాదులు ఆక్షేపిస్తున్నారు.
చర్యలు చేపట్టడంలో మీనమేషాలులెక్కిస్తున్న పోలీసులు...
గాంధీపార్కులో ట్యాంకు నిర్మాణం చేపట్టడం లేదని కమిషనర్, పబ్లిక్‌హెల్త్ విభాగం, కాంట్రాక్టర్ రాతపూర్వకంగా అక్కడ ట్యాంకు నిర్మించలేదని తెలిపారు. రాత్రికి రాత్రే మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గీయులు 30మీటర్లు వెడల్పుతో, 12అడుగుల లోతు తవ్వి మట్టిని తరలించి విక్రయించుకున్నారు. ఇదేవిషయమై ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్టవిరుద్ధంగా వ్యవహారించిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశారు. ఆధారాలున్నప్పటికీ కేసు నమోదు చేయడంలో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేధించామని, తదుపరి చర్యలు చేపట్టుతామని పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. చట్టవిరుద్ధమైన చర్యలు చేపట్టితే ఎవ్వరికైనా ఒక్కలాంటి చర్యలే ఉంటాయని మెసేజ్ ఇవ్వాల్సిన పోలీసు యంత్రాంగంలో డొల్లతనం బహిర్గతమౌతోంది. చట్టవిరుద్ధంగా, సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా వ్యవహారిస్తున్న టీడీపీ నేతలపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
మున్సిపల్‌పార్కులోనే ట్యాంక్ నిర్మిస్తాం– మంత్రి ఆదినారాయణరెడ్డి
ప్రొద్దుటూరు టౌన్ : మున్సిపల్ పార్కులోనే ట్యాంక్ నిర్మించి తీరుతామని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి పార్కులో ట్యాంక్ కోసం తీసిన గొయ్యి వద్దకు మంత్రిని తీసుకొచ్చారు. టీడీపీ కౌన్సిలర్లు ఆ ప్రాంత మహిళలను పార్కులోకి తీసుకొచ్చి తాగునీటి సమస్య ఉందని మంత్రికి చెప్పారు. మంత్రి మాట్లాడుతూ అమృత్ పథకం కింద మైలవరం జలాశయం నుంచి పైపులైన్ పనులను ప్రారంభించామన్నారు. ట్యాంక్ ఎక్కడ కట్టాలన్న విషయం ఇదివరకే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ప్రాంత ప్రజలకు నీటి సమస్య లేకుండా ఇక్కడ ట్యాంక్ నిర్మించాలని టెండర్లు పిలిచామన్నారు. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వచ్చి అడ్డుకున్నారన్నారు. ఎవరు అడ్డుకున్నా పార్కులో ట్యాంక్ నిర్మాణ పనులు ఆగవని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment