
మంత్రిని ప్రశ్నించిన పోతురాజును బయటకుతీసుకెళ్తున్న పోలీసులు
వినుకొండ రూరల్: సీనియర్ నాయకులకు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తోంది అంటూ మంత్రి ప్రత్తిపాటిని ఓ కార్యకర్త నిలదీసిన ఘటన వినుకొండ నియోజకవర్గ మినీ మహానాడులో ఆదివారం చోటుచేసుకుంది. వినుకొండలోని గంగినేని కల్యాణ మండపంలో ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు జరిగింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే పట్టణంలోని ఓ సెలూన్‌లో పనిచేస్తున్న టీడీపీ కార్యకర్త పోతురాజు పుల్లారావు వద్దకు వచ్చి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకులకు పార్టీ ఏమి చేసిందంటూ నిలదీశారు. ఇంతలో మంత్రి కలుగజేసుకొని ‘ఇంతమందిలో నీవు ఒక్కడివే హీరో కాదు’ అంటూ సమాధానం ఇచ్చారు. ఆయన మాటలకు పోతురాజు బదులిస్తుండగా పోలీసులు, టీడీపీ కార్యకర్తలు అతడిని బయటకు పంపించేశారు. నూజెండ్ల మండలానికి చెందిన సీనియర్ నాయకుడికి పార్టీలో పదవులు దక్కకుండా కొందరు అడ్డుపడుతున్నట్లు మినీమహానాడులో విమర్శలు వినిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment