
ఇంటి నుంచి బయటికి రాకుండా మాణిక్యాలరావును అడ్డుకుంటున్న పోలీసులు
తాడేపల్లిగూడెం, రూరల్, తాడేపల్లి రూరల్, సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ, బీజేపీ ప్రజాప్రతినిధుల మధ్య అభివృద్ధిపై చర్చ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో మోహరించడంతో పోలీసులు 144 సెక్షన్ విధించి, ఇరు పార్టీల నేతలను హౌస్ అరెస్టు చేశారు. బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇంటి గోడ దూకి మరీ చర్చా వేదిక వద్దకు వెళ్లేందుకు సన్నద్ధం కాగా పోలీసులు అడ్డుకుని బలవంతంగా లోపలికి పంపారు. మాణిక్యాలరావుకు మద్దతుగా వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహరావు తదితరులను పోలీసులు గుంటూరు జిల్లా సరిహద్దులోనే ఆపేశారు.
ఇటీవల పెంటపాడులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. ఒకరికొకరు ప్రెస్‌మీట్‌ల అనంతరం బహిరంగ చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే మాణిక్యాలరావుకు ఈ నెల 6వ తేదీన జెడ్పీ చైర్మన్ బాపిరాజు (టీడీపీ) సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాణిక్యాలరావు స్పందిస్తూ అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమేనని, వెంకట్రామన్నగూడెంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ చర్చకు వస్తానని బదులిచ్చారు. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. వెంకట్రామన్నగూడెంలో టీడీపీకి చెందిన జెడ్పీ చైర్మన్‌ను, గూడెంలో మాణిక్యాలరావు, మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు (టీడీపీ)ను హౌస్ అరెస్టు చేశారు.
గోడదూకి రోడ్డుపైకొచ్చిన మాణిక్యాలరావు
బహిరంగ చర్చ నేపథ్యంలో బుధవారం రాత్రే జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వెంకట్రామన్నగూడెంలోని పుసులూరి పుల్లారావు నివాసానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు జెడ్పీ చైర్మన్‌ను అక్కడే గృహ నిర్బంధం చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన బహిరంగ చర్చ ప్రాంతానికి చేరుకునేందుకు ప్రయత్నించడంతో పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే మాణిక్యాలరావు బలవంతంగా ఇంటి గేట్లను తోసుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు వెంకట్రామన్నగూడెం వెళ్లడానికి మాణిక్యాలరావు గోడదూకి రోడ్డుపైకి వచ్చారు.
అతన్ని అడ్డుకునే క్రమంలో రక్షణగా నిలచిన బీజేపీ మహిళా కార్యకర్తలు, నాయకులపై పోలీ సులు లాఠీలకు పని చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేను పోలీసులు బలవంతంగా ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లారు. ఈ తరుణంలో బీజేపీ నేత సోము వీర్రాజు ఘటనాస్థలికి చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ సీన్ మారింది. బాపిరాజుకు దమ్ముంటే పోలీసు పికెట్స్ ఎత్తివేయించి పోలీసు వాహనంలో ఎమ్మెల్యేను చర్చకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు బొలిశెట్టి శ్రీనివాస్ దొడ్డిదారిన తప్పించుకుని వెంకట్రామన్నగూడెం చేరుకోగా పోలీసులు బలవంతంగా వెనక్కు పంపారు.
పోలీసులు టీడీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారు..
‘పోలీసులు టీడీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. పోలీసులకు తెలుగుదేశం పార్టీ జీతాలు ఇవ్వడం లేదు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును పరామర్శించేందుకు ఎంపీలు గోకరాజు గంగరాజు, జి.వి.ఎల్.నరసింహారావు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుతో కలిసి గుంటూరు నుంచి తాడేపల్లిగూడెం బయల్దేరగా మార్గం మధ్యలో తాడేపల్లి పట్టణ పరిధిలోని కనకదుర్గమ్మ వారధి వద్ద అర్బన్ జిల్లా నార్త్‌జోన్ సబ్ డివిజన్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఎంపీలతో కలిసి జాతీయ రహదారిపై గంట సేపు బైఠాయించారు. కన్నా, జీవీఎల్‌లు.. విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నియంత పాలనతో అరాచకం చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు వారిని బలవంతంగా జీపులో ఎక్కించి గుంటూరుకు తరలించారు.
అనంతరం కన్నాను హౌస్ అరెస్ట్ చేశారు.కన్నాకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు నగరంపాలెం మీదుగా గుంటూరు మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఎదుట సైతం బైఠాయించారు. పోలీసుల తీరుపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ నేతలు మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందిస్తూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం వల్లే వారిని హోస్ అరెస్ట్ చేశామన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు బీజేపీ నాయకులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment