చింతలపూడి రైతు బజార్ వద్ద ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
పశ్చిమగోదావరి , చింతలపూడి : చింతలపూడిలో గాంధీ జయంతి వేడుకలు టీడీపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణకు దారితీశాయి. స్థానిక రైతు బజార్ సమీపంలోని గాంధీ విగ్రహానికి సోమవారం ఉదయం కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే పీతల సుజాత టీడీపీ నాయకులతో కలిసి ఇక్కడకు చేరుకున్నారు. ఈలోపు టీడీపీ నాయకులు కొందరు గాంధీజీ మెడలోని పూలమాలలను తొలగించి టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిం చారు. దీనిపై ఆగ్రహించిన కాంగ్రెస్ నాయకులు పీసీసీ కార్యదర్శి మారుమూడి ధామస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. టీడీపీ దౌర్జన్యాలు నశించాలని, టీడీపీ డౌన్‌డౌన్ అని ఎమ్మెల్యే సుజాత సమక్షంలో నినాదాలు చేశారు.
టీడీపీ కార్యకర్తలు కూడ కాంగ్రెస్ డౌన్‌డౌన్ అని నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నాయకుల వద్దకు ఎమ్మెల్యే సుజాత వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తాము గాంధీ విగ్రహానికి వేసిన దండలు ఎందుకు తొలగించారో చెప్పాలని కాంగ్రెస్ నాయకులు నిలదీయడంతో ఆమె వెనుదిరిగారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేశారు. సీఐ పి.రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. గాంధీజీ మెడలోని దండలు తొలగించి అవమానించారని, చర్యలు తీసుకోవాలని పలువురు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి జగపతిరావు, కె.కృష్ణమూర్తి, ఎస్.మూర్తుజా లి, వేటా వెంకన్న, ఎస్.సుందరం తదితరులు పాల్గొన్నారు.