సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిపోరు ముదిరి పాకాన పడింది. కొన్నాళ్ల నుంచి ఉప్పూ, నిప్పులా ఉన్న అయ్యన్న అన్నదమ్ముల మధ్య వైరం తీవ్రరూపం దాల్చింది. అయ్యన్నపాత్రుడు, ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు (జమీలు)ల ఆధిపత్యపోరు అదుపు తప్పింది. బాబాయ్, అబ్బాయిలు నర్సీపట్నం పట్టణంలోనూ, నియోజకవర్గంలోను వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయ్యన్న కుమారుడు విజయ్ వ్యవహారశైలితో పార్టీకి నష్టం వాటిల్లుతున్నదంటూ ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబుకు సన్యాసిపాత్రుడు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటిదాకా అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
దీనిపై అయ్యన్నపాత్రుడు మౌనం దాలుస్తూ వచ్చారు. ఈ వివాదం సద్దుమణగక ముందే.. మంత్రి అయ్యన్నను హతమార్చడానికికుట్ర జరుగుతోందంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్టులు హల్‌చల్ చేయడం తాజా రగడకు కారణమైంది. ఇటీవల ఒక ముస్లిం కుటుంబంలో జరిగిన వివాహ వేడుకకు హాజరైనప్పుడు సన్యాసిపాత్రుడు నలుగురితో కలిసి ఈ కుట్రకు శ్రీకారం చుట్టారన్నది ఆ వీడియో సారాంశం. ఇది ఇప్పుడు పార్టీలో చినికిచినికి గాలివానగా మారుతోంది. దీనిపై స్పందించిన సన్యాసిపాత్రుడు ఈ వీడియో క్లిప్‌పై దర్యాప్తు జరిపి అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం జిల్లా ఎస్పీ బాబూజీకి తన కుమారుడు వరుణ్‌తో కలిసి వినతిపత్రం ఇచ్చారు.అనంతరం బుధవారం నర్సీపట్నం ఏఎస్పీకి కూడా మరో వినతి పత్రం ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని అవసరమైతే సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తానని మీడియాకు చెప్పారు. తన సోదరుడు అయ్యన్న, తానూ రామలక్ష్మణుల్లా ఉన్నామని సన్యాసిపాత్రుడు చెబుతున్నారు.
కొన్నాళ్లుగా మాటల్లేవ్!
ఇలావుండగా మంత్రి అయ్యన్నపాత్రుడు, సోదరుడు సన్యాసిపాత్రుడుల మధ్య మాటల్లేవు. అలాగే వారిద్దరి కుమారులకూ అంతే దూరం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇది ఆ కుటుంబంలో ముదిరిన విభేదాలకు అద్దం పడుతోంది. ప్రస్తుతం అయ్యన్న కాశీ యాత్రలో ఉన్నారు. ఆయన వచ్చాక ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment