పదవులకు క్యూ..
- టీడీపీ నేతల తహతహ
- చంద్రబాబుతో మంతనాలు
- పైరవీలు ముమ్మరం
- నామినేటెడ్ పోస్టులపై అసంతృప్త నేతల కన్ను
సాక్షి, విశాఖపట్నం: పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నేతలు పదవుల కోసం తహతహలాడుతున్నారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడంతో అప్పుడే పార్టీలో పదవుల కోసం పోటీ మొదలైంది. కొత్తగా ఎ న్నికైన ఎమ్మెల్యేలతోపాటు వారి అనుచరులు, పోటీకి దూరంగా ఉన్న సీని యర్ నేతలు, టికెట్ దక్కని ఆశావహులు మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం పైరవీలు ముమ్మరం
చేస్తున్నారు.
అందుకోసం కొందరు నేతలు నేరుగా చంద్రబాబును కలిసి తమ కోరికలు వినిపిస్తుంటే, మరికొందరు చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ము ఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు. అటు కిందిస్థాయి నేతలు సైతం ఉత్తరాంధ్ర జిల్లాలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులపై కన్నేశారు. విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో చాలా మంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కాపు, యాదవ, వెలమ సామాజిక వర్గాల నేతలంతా మంత్రి పదవి తమకే వస్తుందనే ధీమాతో నియోజక వర్గాల్లో అప్పుడే హల్‌చల్ చేస్తున్నారు.
వారంతా ఇప్పటికే చంద్రబాబును కలిసి తమ విజ్ఞప్తులు వినిపించారు. గతంలో మంత్రులుగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు , బండారు సత్యనారాయణమూర్తి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఇప్పుడు గంటా ఆ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒకే సామాజిక వర్గానికి చెందిన అయ్యన్న, బండారు ఇద్దరు సీనియర్ నేతలే కావడం, గతంలో పార్టీలో మంత్రులుగా పనిచేయడంతో ఇప్పుడు ఇద్దరూ మం త్రి పదవులు మళ్లీ ఆశిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికే ఆ చాన్స్ దక్కే అవకాశం ఉండడంలో వీరు పలువురు ముఖ్యనేతలతో పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది. అటు బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు విజయం సాధించడంతో ఆయన కూడా చంద్రబాబు మంత్రి వర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
విశాఖ ఎంపీ హరిబాబు ద్వారా, తన సామాజికవర్గ నేతలతో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే కన్నబాబురాజు తనకు టికెట్ దక్కకపోవడంతో కనీసం నామినేటెడ్ పోస్టు కావాలంటూ ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్.మూర్తి కూడా ఎమ్మెల్సీ, రాజ్యసభతోపాటు మరేదైనా పదవి దక్కించుకోవడానికి చంద్రబాబు కోటరీ నేత అయిన నారాయణ ద్వారా పావులు కదుపుతున్నారు.
విశాఖ మహా నగరంలో అత్యంత కీలకమైన వుడా చైర్మన్‌తో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నందున అవి తమకు దక్కేలా చేసుకునేందుకు మాజీ వుడా చైర్మన్ రెహమాన్‌తోపాటు మరికొందరు కూడా పక్క జిల్లాల పార్టీ ముఖ్య నేతల ద్వారా బాబుపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ దక్కక భంగపడ్డ విశాఖ జిల్లా గాజువాక నేత కోన తాతారావు, యలమంచిలి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సుందరపు విజయకుమార్ ఏదైనా నామినేటెడ్ పోస్టు కోసం జిల్లా ముఖ్యనేతల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు.