
భేటీలో మహిళా పారిశ్రామికవేత్తలతో రాహుల్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగిన ఈ భేటీ పలు ఆసక్తికర రాజకీయ సమీకరణాలకు తెరతీసింది. ఈ భేటీకి టీడీపీ వ్యాపారవేత్తలు క్యూ కట్టడం గమనార్హం. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణితోపాటు ఎంపీ టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్, జేసీ తనయుడు పవన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. దగ్గుబాటి సురేశ్‌తోపాటు టీడీపీ అనుకూల పారిశ్రామికవేత్తలు కూడా ఈ సమావేశానికి వచ్చారు.
ఫొటో: రాహుల్‌తో భేటీకి హాజరైన పారిశ్రామికవేత్తలు...
గత కొంతకాలంగా కాంగ్రెస్-టీడీపీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లు కాపురం చేసిన బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా దూరం జరగడంతో.. రానున్న ఎన్నికల్లో కొత్త మిత్రుల కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారు. నాలుగేళ్ల పాలనలో అవినీతి, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తడం, ప్రజావ్యతిరేకత భారీగా పెరగడంతో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లేందుకు బాబు సిద్ధపడటం లేదు. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌తో జోడీ కట్టేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి.
ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనూ ఈ రెండు పార్టీలు అన్యోన్యంగా వ్యవహరించాయి. రాజ్యసభ పీఏసీ సభ్యుని ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వగా.. డిప్యూటీ ఛైర్‌పర్సన్ ఎన్నికలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతునిచ్చింది. కర్ణాటక సీఎం కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు నాయుడు చేతులు చేయ్యేసి ఫొటోలకు ఫోజుచ్చారు. అటు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఏపీలో ఏమంతా మెరుగుపడలేదు. విభజనకు కారణమైన పార్టీగా ఏపీలో కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. విభజనకు, ఏపీని వెనుకబడిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని నిత్యం నిందించే చంద్రబాబు.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో చెట్టపట్టాలకు సిద్ధమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment