
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్) : నేనేంటో... నా సామర్థ్యమేంటో తెలియక మాట్లాడుతున్నావ్.. మీ సామాజిక వర్గానికి ఓట్లు వేసి ఏం సాధిస్తారు.. నీకు సిగ్గు, సంస్కారం లేదా? అంటూ ఒక వైద్యుడిపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు వీరంగం వేశారు. మార్నింగ్ వాక్‌కు వచ్చిన ఆ వైద్యుడు నిష్కారణంగా బొండా వేసిన వీరంగంతో కన్నీటి పర్యంతమయ్యాడు. విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో మాచవరం వాకర్స్ క్లబ్ ఉంది. ఇక్కడ సీతారాంపురం నుంచి రింగ్‌రోడ్డు వరకు ప్రతి నిత్యం వందల మంది వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు. మంగళవారం ఉదయం బొండా ఉమామహేశ్వరరావు అక్కడ ప్రచారానికి వెళ్లారు.
అక్కడ ఉన్న అతని అనుచరులు ఒకొక్కర్ని పరిచయం చేస్తున్నారు. ఈ లోగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ఆ వైద్యుడి వంతు వచ్చింది. అంతే.. బొండా ఉమాలోని కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఆ వైద్యుడు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మల్లాది విష్ణుకు మద్దతుగా పనిచేస్తున్నారని అప్పటికే బొండా ఉమాకు సమాచారం ఉంది. దీంతో ఆయన ఊగిపోతూ మీ సామాజికవర్గమంతా కలిసి విష్ణుకు ఓటేస్తే.. వాడు గెలుస్తాడా...అంటూ ఊగిపోయాడు. మీరెంత? మీ బలమెంత? మీ సామాజికవర్గాన్నంతా మీ వెంటే తిప్పుకోవడానికి ప్రయత్నిస్తే అంగీకరించనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఆయన సమాధానం చెబుతూ విష్ణు తనకు బంధువని .. తమ వర్గాన్ని పలుమార్లు ఆదుకున్నారని చెప్పబోగా మరింత రెచ్చిపోతూ పెద్దపెద్దగా అరవసాగాడు. దీంతో ఆ వైద్యుడు కన్నీటి పర్యంతం కాగా మిగతావారు బొండాను సర్దిచెప్పి అక్కడి నుంచి పంపేశారు.