ఇన్నేళ్లకు బయటపడిన.. దొరవారి దందాగిరీ | TDP Leader Dorababu in Hyderabad Threats Case | Sakshi
Sakshi News home page

ఇన్నేళ్లకు బయటపడిన.. దొరవారి దందాగిరీ

Published Tue, Apr 16 2019 11:59 AM | Last Updated on Fri, Apr 19 2019 1:35 PM

TDP Leader Dorababu in Hyderabad Threats Case - Sakshi

సీఎం చంద్రబాబుతో దొరబాబు (ఫైల్‌)

వంద రాబందులు తిన్న గొడ్డు ఒక్క తుపానుకు కొట్టుకుపోయిన చందంగా.. విశాఖలో విచ్చలవిడి దందాలు, వసూళ్లు, పంచాయితీలతో అడ్డగోలుగా కోట్లకు పడగలెత్తిన టీడీపీ నేత కొఠారు దొరబ్బాయి అలియాస్‌ దొరబాబు ఇప్పుడు టీడీపీ ఫండ్‌ దందా కేసులో హైదరాబాద్‌ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.విశాఖ డిఫ్యూటీ మేయర్‌గా చేసిన కాలంలో ఎన్నో అక్రమాలు, అవినీతి చర్యలకు పాల్పడినా.. ఎప్పటికప్పుడు బయటపడుతూ వచ్చిన ఈ దొరవారి పాపం ఇన్నేళ్లకు పండినట్లు కనిపిస్తోంది.పార్టీ ఫండ్‌ ఇస్తారా.. చస్తారా... అంటూ విజయవాడకు చెందిన వీరపనేని రవికాంత్‌ అనే పారిశ్రామికవేత్తను బెదిరించిన కేసులో దొరబాబుదే కీలకపాత్ర అని తెలుస్తోంది.టీడీపీ నేత కావడంతో ఏపీలో ఫిర్యాదు చేస్తే ఉపయోగం ఉండదని భావించిన బాధితుడు రవికాంత్‌ హైదరాబాద్‌లో ఫిర్యాదు చేయడంతో దొరబాబు సహా ఈ దందాలో ఉన్న నేతలపై కేసులు కట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.కోర్టు దృష్టికి తీసుకెళ్లి కేసు నమోదు చేసేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమవుతున్న నేపథ్యంలో దొరబాబు బండారంపై నగరంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఏపీతో పాటు తమిళనాడు, ఒడిశాల్లో మనోహర గ్రీన్స్‌ లాజిస్టక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తున్న విజయవాడకు చెందిన వీరపనేని రవికాంత్‌ను ఏకంగా సీఎం చంద్రబాబు ఇంటి నుంచే ఫోన్‌ చేసి బెదిరింపులకు తెగబడిన సంగతి తెలిసిందే. పార్టీ ఫండ్‌ ఇస్తారా.. చస్తారా.. అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు సన్నిహితులైన టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు. ఎన్నికలైన తర్వాత ఫండ్‌ ఏమిటి.. నావల్ల కాదు వదిలేయండి అని మొత్తుకున్నా వదల్లేదు.

రూ.8 కోట్లు ఇవ్వకుంటే ఫ్యామిలీతో సహా చంపేస్తామని వార్నింగ్‌ ఇవ్వడంతో ప్రాణభయంతో రవికాంత్‌ హైదరాబాద్‌ పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటు ఏపీ, అటు తెలంగాణ రాష్ట్రాల్లో కలకలం రేపిన ఈ దందాలో విశాఖ నగరానికి చెందిన మాజీ ఢిప్యూటీ మేయర్‌ కొఠారు దొరబ్బాయ్‌ అలియాస్‌ దొరబాబుదే కీలక పాత్ర అని తెలుస్తోంది. తొలుత టీడీపీకి చెందిన ఓ మాజీ కేంద్రమంత్రికి సన్నిహితంగా మెలిగే వెంకట్రావు నాయుడు.. వ్యాపారి రవికాంత్‌ను సంప్రదించారు. ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి ఫండ్‌ ఇవ్వాలని కోరారు. అయితే తన ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేనందున ఈసారి తాను ఏమీ ఇవ్వలేనని రవికాంత్‌  స్పష్టం చేశారు. ఇందుకు వెంకట్రావునాయుడు  స్పందిస్తూ డబ్బు ఇవ్వాల్సిందేనని, సీఎం చంద్రబాబు మీకు రూ.8 కోట్ల ఫండ్‌ టార్గెట్‌ పెట్టారని చెప్పుకొచ్చారు. అంత మొత్తం తన వల్ల కాదని రవికాంత్‌ చెప్పడంతో విశాఖ మాజీ డిఫ్యూటీ మేయర్‌ దొరబాబు రంగంలోకి దిగారు.

సీఎం గంటగంటకూ ఫాలో అప్‌ చేస్తున్నారని బెదిరించిన దొరబాబు
దొరబాబు నేరుగా తన మొబైల్‌ నెంబర్‌ నుంచే రవికాంత్‌కు ఫోన్‌ చేశారు. సీఎం గంటగంటకూ ఫాలో అప్‌ చేస్తున్నారని, అమౌంట్‌ విషయం ఏమైందని ఫోన్‌ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత శ్రీనివాస్‌ అనే వ్యక్తి  ఫోన్‌ చేసి ఒత్తిడి చేశాడు. దీంతో రవికాంత్‌ హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెదిరింపుల పూర్వాపరాలు పరిశీలించిన పోలీసు అధికారులు కోర్టు అనుమతి తీసుకుని కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఏకంగా సీఎం పేరు చెప్పి నేరుగా తన మొబైల్‌ నెంబర్‌తోనే బెదిరింపుల పర్వానికి దిగిన దొరబాబు దందాల చిట్టాపై ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

టీడీపీ ఆఫీస్‌ పేరిట వ్యాపారులకు ఇండెంట్లు
విశాఖ నగరంలో టీడీపీ కార్యాలయ నిర్మాణం పేరిట ఈయన చేసిన వసూళ్లు. దందాలు వ్యాపారులకు తెలియనికావు, వాస్తవానికి దివంగత ఎంవీవీఎస్‌ మూర్తి పార్టీ కార్యాలయ నిర్మాణ బాధ్యత తీసుకుంటే.. ఆయనకు సన్నిహితంగా మెలిగిన దొరబాబు అడ్డగోలుగా వసూళ్ల పర్వానికి తెరలేపారు. మూర్తికి తెలియకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేశారన్న వాదనలు ఆ పార్టీ వర్గాల్లో ఇప్పటికీ ఉన్నాయి. నగరంలోని ప్రతి వ్యాపారికి రూ.3 లక్షలు ఇండెంట్‌ పెట్టి వసూలు చేశాడన్న ఆరోపణలున్నాయి. ఇక టీడీపీలోనే ఉన్న ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నుంచి పార్టీ ఆఫీసులో లిఫ్ట్‌ ఏర్పాటు పేరిట రూ.3లక్షలు వసూలు చేసిన సదరు దొరబాబు.. అదే లిఫ్ట్‌ పేరిట ఇతర వ్యాపారుల వద్ద కూడా దండుకున్న ట్రాక్‌ రికార్డ్‌ ఉంది.

కొన్నాళ్లుగా అమరావతిలో మకాం
లోకేష్‌ ఓసారి నగరానికి వచ్చినప్పుడు వ్యాపారస్తులతో గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేసిన దొరబాబు ఆ తర్వాత నుంచి లోకేష్‌బాబుకు నేను ఎంత చెబితే అంత.. అని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇటీవలికాలంలో అమరావతికి మకాం మార్చారు. ఎక్కువగా అక్కడే ఉంటూ సీఎం ఇంట్లోనూ, కార్యాలయంలోనూ హల్‌చల్‌ చేస్తూ వస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో  టీడీపీ టికెట్ల కేటాయింపులోనూ దొరబాబు హడావుడి చేశారన్న వాదనలు వినిపించాయి. ఇప్పుడు ఏకంగా సీఎం పేరిట బెదిరింపుల కేసులో ఉండటంతో దొరబాబు బండారం ఇన్నాళ్లకు బయటపడిందన్న చర్చ జరుగుతోంది.

మొదటి నుంచి వసూళ్ల పర్వమే
విశాఖలో దొరబాబు పేరు చెబితేనే వసూళ్లపర్వాలు, దందాలు గుర్తొస్తాయి. పశ్చిమగోదావరి జిల్లా గౌరీపట్నం ప్రాంతానికి చెందిన దొరబాబు కొన్నేళ్ల క్రితం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. తొలుత సాగర్‌నగర్‌లో హేచరీస్‌ లీజు తీసుకుని వ్యాపారం చేశారు. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరిట దుకాణం తెరిచి.. నమ్మి పెట్టుబడి పెట్టిన స్నేహితులనే ముంచాడన్న పేరు పొందారు. తదనంతరం  రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్‌గా గెలిచిన తర్వాత అప్పటి కాంగ్రెస్‌ నేతల అండతో డిఫ్యూటీ మేయర్‌ అయ్యారు. ఈ పదవిని అడ్డుపెట్టుకుని అతను చేసిన  అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. చెత్త  పేరిట జరిగిన కుంభకోణం బయటపెడతానని కౌన్సిల్‌లో హడావుడి చేసి చెత్త తొలగించే కాంట్రాక్టు సంస్థల నుంచి రూ.కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ప్రాజెక్టులో పనులు ఇప్పిస్తానంటూ ఎంతోమంది కాంట్రాక్టర్ల వద్ద రూ.కోట్లు కొల్లగొట్టిన చరిత్రా ఉంది.

దొరబాబుది మొదటి నుంచి అదే నైజం :వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి
నమ్మిన స్నేహితులను కూడా నట్టేట ముంచే దొరబాబుది మొదటి నుంచి దందాలు, బెదిరింపుల నైజమేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. వసూళ్లు. దందాలు అతనికి వెన్నతో పెట్టి విద్య అని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి రాదని తెలిసే.. 40 రోజుల్లో రూ.వేల కోట్లు దండేయాలని టీడీపీ అగ్రనేతలు ఇలా వసూళ్లు చేస్తున్నారని కొయ్య దుయ్యబట్టారు. ఇలాంటి వాటిల్లో ఆరితేరిన దొరబాబుకే చంద్రబాబు, లోకేష్‌లు ఆ బాధ్యత అప్పజెప్పారని విమర్శించారు. దొరబాబుపై తెలంగాణ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి గతంలో ఆయన చేసిన నేరాల చిట్టా కూడా బయటపెట్టాలని కొయ్య డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతల వేధింపులతో విసిగివేశారిన రవికాంత్‌ అనే వ్యాపారి ధైర్యంగా పోలీసులను ఆశ్రయించారు కాబట్టి ఈ దందా బయటికొచ్చిందన్నారు. విశాఖలో కూడా టీడీపీ నేతలు ఇలాంటి దందాలు, వసూళ్లకు పాల్పడితే వెంటనే వ్యాపారులు పోలీసులను ఆశ్రయించాలని కొయ్య విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement