కేసీఆర్‌.. ద్రోహానికి ప్రతిరూపం | TDP Leader Ramana Fires On KCR Over Governance In Telangana | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 24 2018 2:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TDP Leader Ramana Fires On KCR Over Governance In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నయా నిజాంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌. రమణ అన్నారు. ఉద్యమవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో కేవలం కేసీఆర్‌ కుటుంబ పెత్తనమే నడుస్తోం దని ప్రజలకు అర్థమయిందని, అందుకే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసం ఎక్కడకు వెళ్లినా ప్రజలు తిరగబడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, సీపీఐలతో కలసి తాము ఏర్పాటు చేస్తున్న మహాకూటమి పవర్, పైసలు, పదవుల కోసం కాదని, ఉద్యమ అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రమణ మంగళవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలివి... 

సాక్షి: తెలుగుదేశం పార్టీ అంటే తెలంగాణ వ్యతిరేక పార్టీ అనే భావన గత ఎన్నికల సందర్భంలో కనిపించింది. ఇప్పుడు మీ పార్టీపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? 
రమణ: తెలుగుదేశం పార్టీ... తెలంగాణ ప్రజలు ముఖ్యంగా పేదల గుండెల్లో ఉన్న పార్టీ. గత ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకత్వాన్ని బలహీనపర్చాలనే దురుద్దేశ, దుర్మార్గపు ఆలోచనతో కేసీఆర్‌ కావాలని విష ప్రచారం చేశారు. తెలంగాణ వచ్చాక జరిగిన ఎన్నికల్లోనే టీడీపీ–బీజేపీ కూటమికి 20 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో ప్రజలు విజయం కట్టబెట్టారు. కులమతాలు, ప్రాంతాలను అడ్డుపెట్టుకొని కేసీఆర్‌ చేసిన కుట్రలను తిప్పికొట్టారు. మాపట్ల తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ సదభిప్రాయం ఉంది. 

టీడీపీకి ఓటేస్తే అమరావతికి వెళ్తుందని టీఆర్‌ఎస్‌ నేతలంటున్నారు కదా? 
తెలంగాణ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడమే కేసీఆర్‌ పని. పబ్బం గడుపుకుని ద్రోహం చేయడానికి ప్రతిరూపం కేసీఆర్, ఆయన కుటుంబం. ఇద్దరు ఎంపీలను పెట్టుకుని తామే తెలంగాణను తెచ్చినట్లు అభూతకల్పనలు సృష్టించారు. ఉద్యమ అమరవీరుల త్యాగాలను తన ఖాతాలో వేసుకున్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికారమిస్తే దాన్ని కుటుంబానికి అన్వయించుకున్నారు. ఈ నయా నిజాం కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు 60 నెలల అధికారమిస్తే తన తరఫున గెలిచిన 63 మందితోపాటు మరో 30 మంది దొంగలను కలుపుకొని దొంగల ముఠానాయకుడిగా వ్యవహరించిన కేసీఆర్‌ ఇప్పుడు కాడి ఎత్తేయగానే జనం తిరగబడుతున్నారు. ఇవన్నీ జీర్ణించుకోలేకే వాళ్లకి ఓటేస్తే అమరావతికి, వీళ్లకి ఓటేస్తే ఢిల్లీకి అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మమ్మల్ని చూస్తే ఆయనకు లాగులు తడుస్తున్నాయి.  

ప్రతిపక్షాలు పనికిరావనే టీఆర్‌ఎస్‌ విమర్శలకు మీ సమాధానం? 
తెలంగాణను ఈ దేశంలో అంతర్భాగంగా కేసీఆర్‌ భావించట్లేదు. ఇదో ఫెడరల్‌ వ్యవస్థ అని, దేశంలో రాజ్యాంగం ఉందని అనుకోవట్లేదు. అందుకే తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. ఇది భారత రాజ్యాంగం. ప్రతిపక్షం పనికిరానిదో, పనికి వచ్చేదో ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు పెనం చల్లారిపోయింది. కేసీఆర్‌ రొట్టె కాలే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. పెన్నుల మీద మట్టి కప్పితే గన్నులై మొలకెత్తిన సమాజం ఇది. ఇక్కడ కేసీఆర్‌ పీట పునాదులు కదులుతున్నాయి. కేసీఆర్‌ రూపంలో పట్టిన శని పోగొట్టే రోజులు వస్తున్నాయి. 

కూటమిలో భాగంగా టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీచేయనుంది? 
మేము సీట్లు, పదవుల కోసం పాకులాడట్లేదు. 0.02 శాతమే టీడీపీ ఉందని హేళనగా మాట్లాడిన వ్యక్తికి కుక్కకాటుకు చెప్పుదెబ్బ కొట్టాలనే వ్యూహంతోనే ముందుకెళుతున్నాం. సీట్ల కేటాయింపుల్లో పట్టువిడుపులుంటాయి. 

ఈసారి ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా? 
1994 నుంచి 2014 ఎన్నికలకు 9 ఎన్నికల్లో పోటీ చేశా. జీవన్‌రెడ్డి, చొక్కారావు, ఎమ్మెస్సార్, విద్యాసాగర్‌రావు, కేసీఆర్‌ లాంటి నాయకులను ఎన్నికల్లో ఎదుర్కొన్నా. నేను పోటీ చేయాలా వద్దా... చేస్తే ఎక్కడి నుంచి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. త్యాగాలకు ఎప్పుడూ మొదలు నిల్చునే వ్యక్తిని నేను. 

కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో చేరతారా? 
రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే కూటములన్నీ విజయవంతం కావు. ఇది దేశ రాజకీయ చరిత్ర చెబుతోంది. కానీ మా కూటమి శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాం. గత 45 రోజులుగా ఇబ్బందుల్లేకుండానే చర్చలు జరుపుకుంటున్నాం. మేం ప్రభుత్వంలోకి రావాలి. కేంద్ర ప్రభుత్వ పునాదులు కదలాలి. గ్రామ సర్పంచ్‌ నుంచి లోక్‌సభ స్పీకర్‌ వరకు పదవులను నిర్వహించిన చరిత్ర టీడీపీది. మాకు అవకాశమిస్తే సమర్థత నిరూపించుకున్నాం. బాధ్యతలు తీసుకునే సందర్భం వస్తే వెనుకాడాల్సిన పరిస్థితి ఉండదు. 

కూటమి కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రాధాన్యాంశాలేంటి? 
తెలంగాణ ఉద్యమం స్వయం పాలన, సబ్బండ వర్ణాల సంక్షేమం, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జరిగింది. కానీ తెలంగాణ ఏర్పడ్డాక అవేమీ కనిపించట్లేదు. కేసీఆర్‌ కుటుంబంలోనే ఒకరు ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు, ఒక ఎంపీ, ఆయన బంధువులకు పదవులు వచ్చాయి. అందుకే పారదర్శకతో కూడిన సమాజ సమతౌల్యత కోసం పీపుల్స్‌ ఎజెండా రూపొందిస్తున్నాం. ప్రతి రైతుకు రూ. 2 లక్షల ఏకకాల రుణమాఫీ, తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు, 3 నెలల్లోనే 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ, రూ. లక్షకు తగ్గకుండా మహిళా సంఘాలకు రుణాలు, పరిశ్రమలకు ప్రోత్సాహం, విద్యావకాశాలను మెరుగుపర్చడం, కార్మిక, కర్షక, విద్యార్థి, నిరుద్యోగులు, అన్ని వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేలా కార్యాచరణ రూపొందించడం మా కనీస ఉమ్మడి ప్రణాళికలో భాగం.  

టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేయకూడదు.. కూటమికే ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? 
దళితుడిని సీఎం చేస్తానని ద్రోహం చేసిన వ్యక్తి కేసీఆర్‌. ఆయన కుటుంబమే పెత్తనం చేస్తుందని ప్రజలకు అర్థమైపోయింది. రూ. 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారో అర్థం కావట్లేదు. కోటి ఎకరాలకు నీరన్నారు. లక్ష ఎకరాలకూ రాలేదు. భగీరథ నీళ్ల ఆనవాళ్లు లేవు. లక్ష ఉద్యోగాలన్నారు. ఇంకో లక్ష ఖాళీ అయ్యాయి. దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేయలేదు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు, కేజీ టు పీజీ విద్య, మైనారిటీ, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఇవన్నీ చెప్పి చేయని మోసగాడు కేసీఆర్‌. ఆయనకు మళ్లీ అధికారమిస్తే మోసం చేస్తారే తప్ప న్యాయం చేయడు. మేం మెరుగైన పాలన అందిస్తాం. అందుకే మాకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నాం.

కాంగ్రెస్‌ వ్యతిరేక పునాదులపై ఏర్పడ్డ టీడీపీ ఇప్పుడు అదే పార్టీతో కలసి కూటమిని ఏర్పాటు చేస్తోంది. దీన్ని ఎలా సమర్థించుకుంటారు? 
నాడు జాతీయ కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యాన్ని ఎదుర్కొని రాజకీయాల్లో సమన్యాయం కావాలనే ఆలోచనతో ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం. ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలోని మెజారిటీ నేతలు టీడీపీలో పుట్టినవారే. 0.02 శాతం ఉన్నామని తెలుగుదేశం నేతలను కేసీఆర్‌ హేళన చేశాడు. కోదండరాం సభలకు 500 మంది వస్తారా అని ఎద్దేవా చేశాడు. కమ్యూనిస్టులెక్కడున్నారని ప్రశ్నించాడు. అందుకే వారితో కలసి ఫ్రంట్‌ ఏర్పాటు చేసి ముందుకెళ్లాలనుకుని మేమే చొరవ తీసుకున్నాం. మా మూడు పార్టీలతో కలసి పనిచేసేందుకు కాంగ్రెస్‌ ముందుకొచ్చింది. మేం కాంగ్రెస్‌ను అడగలేదు. కేసీఆర్‌ దుర్మార్గపు పాలనను అంతమొందించి పీడిత ప్రజల గొంతుక కావాలని, వారి అరణ్య రోదనకు వేదిక కావాలనే మహాకూటమిని ఏర్పాటు చేశాం. 

ఎన్నికల ప్రచారాన్ని మీరెప్పుడు మొదలుపెడతారు? 
ఎన్నికల కమిషన్‌ చెప్పాల్సిన విషయాలను, పోలింగ్‌ జరిగే తేదీలను కూడా చెప్పి చీవాట్లు తిన్న మొదటి సీఎంగా కేసీఆర్‌ చరిత్ర సృష్టించారు. ఆయన వేసే ట్రాప్‌లో పడే పిచ్చోళ్లం కాదు. ఆయనే ఈసారి మా ట్రాప్‌లో పడ్డారు. ఎప్పుడు అభ్యర్థులను ప్రకటించాలి... ఎప్పుడు ప్రచారానికి వెళ్లాలన్నది మాకు బాగా తెలుసు. మా ఎన్నికల ప్రచారాన్ని ఖమ్మంలో ఇప్పటికే బాలకృష్ణ ప్రారంభించారు. పార్టీ అధినేత హోదాలో చంద్రబాబు కూడా ప్రచారానికి వస్తారు. ఎలక్షన్, పోల్‌ మేనేజ్‌మెంట్‌లో మేమే నంబర్‌వన్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement