ఎంపీడీఓ పద్మజపై మండిపడుతున్న తూముల భాస్కరరావు
బొబ్బిలి రూరల్:ప్రోటోకాల్ పాటించలేదనే కారణంలో నిజాయితీగా పనిచేస్తున్న అధికారులపై టీడీపీ నాయకులు ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆగ్రహంతో ఊగిపోయారు. సారీ చెప్పినా చెలరేగిపోవడంతో అధికారులు నిశ్చేస్టులయ్యారు. వివరాల్లోకి వెళితే.. కాశిందొరవలస పంచాయతీ పరిధి ఎరకందొరవలస గ్రామంలో వాటర్‌స్కీం ప్రారంభోత్సవానికి మంత్రిని పిలిచి తమను పిలువలేదనే కారణంతో రాష్ట్రఫైనాన్స్ కమిషన్ సభ్యుడు తూముల భాస్కరరావు, జన్మభూమి కమిటీ అధ్యక్షుడు అల్లాడ భాస్కరరావులు ఎంపీడీఓ ఆర్వీ పద్మజ, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ పి.శంకరరావు, డీఈ పీఎంకే రెడ్డిలపై ఫైర్ అయ్యారు.
మంత్రి కార్యక్రమానికి తమకు ఆహ్వానం లేకపోతే ఎలా...? తాము నాయకులమనే విషయం అధికారులు గుర్తించరా...? ఈ విషయం కలెక్టర్‌కు అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామంటూ తూముల భాస్కరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ ఆర్వీ పద్మజ కలుగజేసుకుని తమకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలియజేశారని సమాధానం చెప్పినా శాంతించకుంగా ఆగ్రహంతో ఊగిపోయారు. జేఈ శంకరరావు ఎంపీపీకి, ఎంపీడీఓకు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు సమాచారం అందించామని తెలిపారు. డీఈ పీఎంకె రెడ్డి సారీసార్, పొరపాటు జరిగిందని చెప్పారు. అయితే, అధికారులకు మెమోలు ఇచ్చేలా తమ పవర్ చూపిస్తామని ఎంపీడీఓను హెచ్చరించారు. గతంలో అంగన్‌వాడీ భవనం ప్రారంభంలోనూ ప్రోటోకాల్ పాటించలేదని తూముల భాస్కరరావు అధికారులపై ఫైర్ అయ్యారు.
రెచ్చిపోయిన జన్మభూమి కమిటీ అధ్యక్షుడు....
గతంలో తన అక్రమాలు వెలికితీసి తన సర్పంచ్ చెక్‌పవర్ రద్దుకు కారణమయ్యారనే కారణంతో ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ శంకరరావుపై పత్రికల్లో రాయలేని భాషతో జన్మభూమి కమిటీ అధ్యక్షుడు, పారాది సర్పంచ్ అల్లాడ భాస్కరరావు రెచ్చిపోయాడు. ఇలాంటి జేఈని ఎందుకు తీసుకువచ్చారు...? నీకు చేతకాకపోతే మేం చేసుకుంటాం... కనీసం పక్కపంచాయతీ సర్పంచ్‌కు సమాచారం ఇవ్వవా..? అంటూ ఏకవచనంతో సంబోధించారు. నిజాయితీపరుడిగా, మంచి నైపుణ్యం గల వ్యక్తిగా పేరొందిన శంకరరావును గతంలో మంత్రి అనుచరులు, జన్మభూమి కమిటీ అధ్యక్షుడు అనేక ఇబ్బందులు పెట్టారు. వ్యక్తిగత దూషణలు చేయడంతో అ«ధికారులు విస్తుపోయారు. ఇలాంటి పాలకుల హయాంలో పనిచేయడం కష్టమేనంటూ మదనపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment