
సాక్షి, గుంటూరు/అమరావతి: ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ను టార్గెట్ చేస్తూ రాజధాని ఆందోళనకారుల ముసుగులో టీడీపీ వరుస దాడులకు పాల్పడుతోంది. గుంటూరు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు మహిళలను ముందుపెట్టి ఎంపీ నందిగం సురేష్‌పై, ఆయన గన్‌మెన్, అనుచరులపై దాడి చేశారు. అమరావతి అమరలింగేశ్వరస్వామి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం అమరావతిలో జరిగిన రథోత్సవం కార్యక్రమానికి రాజధాని ప్రాంతం నుంచి ఆందోళనకారుల ముసుగులో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
రథోత్సవం కార్యక్రమం జరుగుతున్నంతసేపు వారు ఎంపీ సురేష్‌ను కించపరిచేలా దుర్భాషలాడారు. వారి తీరును గుర్తించిన ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అక్కడి నుంచి ఒకే కారులో గుంటూరు బయల్దేరారు. సురేష్ గుంటూరు వైపు బయల్దేరిన విషయాన్ని రాజధాని ప్రాంతం నుంచి అమరావతికి బస్సులో వస్తున్న టీడీపీ మహిళలు, నాయకులకు చెప్పారు. లేమల్లె గ్రామంలో తన కారులోకి మారడానికి సురేష్ కారు దిగారు. అదే సమయంలో రాజధాని ప్రాంతం నుంచి అమరావతికి వస్తున్న టీడీపీ నాయకులు వారి బస్సును సురేష్ కారుకు అడ్డుపెట్టి మహిళలను కిందకు దించారు.
అసభ్యపదజాలంతో దూషిస్తూ...
బస్సు దిగిన మహిళలు ఎంపీ సురేష్‌ను రాయలేని పదజాలంతో దుర్భాషలాడుతూ ఆయనపై దాడికి దిగారు. ఎంపీ డ్రైవర్, పీఏ లక్ష్మణ్‌పై దాడిచేసి కొట్టారు. పీఏ లక్ష్మణ్ సోదరుడిని కొందరు మహిళలు చెప్పుతో కొట్టారు. మరికొందరు మహిళలు గన్‌మెన్, ఎంపీ అనుచరులపై కారం చల్లడం మొదలు పెట్టారు. దీంతో అప్రమత్తమైన గన్‌మెన్, అనుచరులు ఎంపీ సురేష్‌ను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు. మహిళలను ముందుపెట్టి ఎంపీ సురేష్‌పై దాడి చేసి గన్‌మెన్, ఆయన అనుచరుల కళ్లలో కారం కొట్టిన అనంతరం బస్సులో ఉన్న టీడీపీ నాయకులు దిగి ఎంపీ సురేష్‌ను అంతమొందించాలని కుట్ర పన్నారని ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెలలో ఎంపీ సురేష్‌పై టీడీపీ నాయకులు దాడి చేయడం ఇది రెండోసారి.
ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆగ్రహం
ఎంపీపై దాడి విషయం తెలుసుకున్న లేమల్లె, 14వ మైలు గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ మహిళలు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు. టీడీపీ నాయకులు, మహిళలు ఉన్న బస్సును కదలనివ్వకుండా రోడ్డుపై బైఠాయించారు. ఈలోపు పోలీసులు సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకుని ఎంపీపై దాడి చేసిన మహిళలను, బస్సును అదుపులోకి తీసుకుని పెదకూరపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించగా టీడీపీ నాయకుల సమాచారం మేరకు లింగాపురంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బస్సును అడ్డగించారు. పోలీసులపై రాళ్లు రువ్వగా ఏఆర్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. దీంతో వారిని పెదకూరపాడుకు తీసుకువెళ్లడం సాధ్యంకాక అమరావతికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment