సాక్షి, అమరావతి/ తుళ్లూరు/ విశాఖపట్నం /గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు పన్నిన పన్నాగం ప్రకారమే తనపై దాడి చేసి అంతమొందించే ప్రయత్నం జరిగిందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ఇందుకు కారణమైన ప్రతిపక్ష నేతను తక్షణం అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో రథోత్సవం ముగిశాక తాను, వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి నడుచుకుంటూ వస్తుండగా కొందరు ‘జై అమరావతి.. జై సీబీఎన్’ అని నినాదాలు చేస్తూ.. తనను బూతులు తిడుతూ వెంటపడ్డారని చెప్పారు. ఎదురు తిరిగే పరిస్థితి లేకపోవడం, తన వాహనం రాకపోవడంతో అప్పిరెడ్డి కారెక్కి మద్దూరు వైపు తిరగ్గానే.. వాహనంపై దాడికి యత్నించారని చెప్పారు. అక్కడి నుంచి లేమల్లె గ్రామానికి చేరుకుని.. వాహనాలు మారడానికి నిలబడి ఉండగా ఒక బస్సులో జేఏసీ ముసుగులో వచ్చిన మహిళలు తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని వివరించారు.
వారంతా టీడీపీలో క్రియాశీలంగా తిరిగే మహిళలేనన్నారు. ఓ యువతి వచ్చి ‘నువ్వు ఎంపీవా! మమ్మల్ని ఏం పీకుతార్రా’ అని దుర్భాషలాడితే అలా మాట్లాడటం భావ్యం కాదని చెప్పానని, ఈలోపు పదిమంది మహిళలు తనపై కారం చల్లారని తెలిపారు. తన వద్ద పనిచేసే లక్ష్మణ్ అనే వ్యక్తిని, అతడి అన్నను చెప్పుతో కొట్టారన్నారు. తాము పెదకూరపాడుకు వెళుతుంటే లింగాపురం వద్ద 300 మంది కలిసి దాడి చేసి గాయాలయ్యేలా కొట్టడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయామని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలను విలేకరుల సమావేశంలో చూపారు. టీడీపీ వారి బస్సులోకి కారం ప్యాకెట్లు ఎలా వచ్చాయని ఎవరైనా అడిగితే.. వారే (ఎంపీ మనుషులే) వేశారని చెప్పాలంటూ బస్సులోనే ఉన్న రాణి అనే మహిళ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోను సురేష్ ప్రదర్శించారు. ఘటన జరిగిన కొద్దిసేపట్లోనే గల్లా జయదేవ్, ఆలపాటి రాజా అక్కడకు చేరుకున్నారంటే ఏ స్థాయిలో పన్నాగం పన్నారో అర్థం అవుతుందన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌కు డిమాండ్
చంద్రబాబు రాజకీయ శిఖండిలా మారారని ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, మద్దాళి గిరి, వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఎంపీ నందిగం సురేష్‌పై దాడిని నిరసిస్తూ సోమవారం గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రదర్శన చేపట్టారు. ఎంపీ సురేష్‌ను గుంటూరు జిల్లా ఉద్దండ్రాయునిపాలెంలో ఎమ్మార్పీఎస్‌ఎస్ నాయకులు పరామర్శించారు.
దళితులంటే చంద్రబాబుకు చులకన
చంద్రబాబుకు తొలినుంచీ దళితులంటే చాలా చులకన అని, ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవని మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం వారు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ముసుగులో వచ్చి దళిత ఎంపీపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అక్రమాలు, అవినీతి బయటపడుతుండంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎంపీపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మాట్లాడుతున్న మంత్రులు వనిత, సుచరిత, విశ్వరూప్
Comments
Please login to add a commentAdd a comment