
సాక్షి, అమరావతి: అమరావతి విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆయన ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడా? లేక బినామీ సంఘాల నాయకుడా? అనేది అర్థం కావడం లేదని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాలకు అడ్డు పడవద్దని లోకేష్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన వారిపై టీడీపీ గూండాలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను కించపరిచేలా బంగారు నగలు ధరించారని, ఖరీదైన దుస్తులతో వచ్చారని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.
నిన్నటి ఫోటోలను బయట పెడితే కృత్రిమ ఉద్యమం ఎవరిదో, ఆకలి కేకలు ఎవరివో తెలుస్తాయని చెప్పారు. ఇళ్ల స్థలాలు కావాలన్న పేదలను ఆర్టిస్టులని ఎగతాళి చేయడమే కాకుండా ట్రాక్టర్లతో తొక్కించేందుకు ప్రయత్నించారని చెప్పారు. అమరావతిలోని 29 గ్రామాల్లో తాను, తన సామాజిక వర్గం మాత్రమే ఉండాలని, ఇతరులు ఉంటే చంపేస్తామనే తరహాలో చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని శంకుస్థాపన సమయంలో భూములిచ్చిన అగ్రవర్ణాలను పట్టుబట్టలతో సత్కరించిన చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను మాత్రం దరిదాపుల్లోకి రానివ్వలేదని చెప్పారు. రాజధానికి రెండు నుంచి మూడు వేల ఎకరాలు తీసుకుని మిగిలింది రైతులు అభివృద్ధి చేసుకునేందుకు వదిలేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment