సాక్షి, కడప కార్పొరేషన్: ఎన్నికల షెడ్యూల్ విడుదలై పది రోజులైంది.. అధికార టీడీపీ అభ్యర్థి ఎవరో అంతు చిక్కలేదు. నోటిఫికేషన్ కూడా వచ్చి 24 గంటలు గడిచింది... అయినా అభ్యర్థిపై పీటముడి వీడలేదు. ఓ వైపు నామినేషన్ల పర్వం మొదలైనా టీడీపీ అధినేత కడపలో పార్టీ ‘లీడర్’ ఎవరో చెప్పకపోవడంతో క్యాడర్‌లో నిస్తేజం అలుముకుంది. అధినేత మనసులో ఏముందో.. టికెట్ దక్కేదెవరికోగానీ.. తమకే టికెట్ అంటూ తెలుగుదేశం పార్టీ తరఫున ‘ఇద్దరు’ అభ్యర్థులు ప్రచారం చేస్తుండటం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. ఆ మధ్య పార్టీలో చేరిన మరుక్షణమే అష్రఫ్‌ను కడప ఇన్‌చార్జిగా చంద్రబాబు ప్రకటించారు. ఇంకేముంది ‘టికెట్ నాకే’ అంటూ అష్రఫ్ ప్రచారంలో దిగారు.
అంతే ఇన్నేళ్లు పార్టీలో ఉన్న తమను కాదని ఇప్పుడొచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ నేతలంతా ఒక్కసారిగా అసమ్మతి రాగం అందుకున్నారు. అలాగే మంత్రి ఆది నారాయణరెడ్డి కూడా అష్రఫ్‌కు టికెట్ ఇస్తే తాను పోటీ చేయనని మొండికేశారంట. పరిస్థితి ముందునొయ్యి.. వెనుకగొయ్యిలా మారడంతో అధిష్టానం టికెట్‌పై ఎటూ తేల్చకుండా నాన్చుతోంది. ఇంతవరకు టికెట్ పీటముడిని విప్పని బాబు ‘కడప టికెట్ మైనార్టీకే’ అని మాత్రం తేల్చిచెప్పారంట. దీంతో అమీర్‌బాబు, అష్రఫ్‌లు పోటీలో నిలిచా రు. తాజాగా తనకే టికెట్ ఖరారయ్యిందంటూ వీఎస్ అమీర్‌బాబు , మరోవైపు తనకే టికెట్ ఖరారు అవుతుందని, తనకు కాకపోతే తన తండ్రి అహ్మదుల్లాకైనా టికెట్ ఇస్తారంటూ అష్రఫ్ ఫోన్లలో ప్రచారం చేస్తున్నారు. ఆఖరికి టికెట్ దక్కేదెవరికో.. పోటీ చేసేదెవరో చూడాలి. నామినేషన్ల పర్వం మొదలైనా టీడీపీలో నెలకొన్న గందరగోళ ప్రచారాన్ని చూసి నగర ప్రజలు ‘వారెవ్వా.. క్యా సీన్ హై’ అంటూ గుసగుసలాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment